మారేడ్‌పల్లి, జూలై 30 : రైళ్లలో ప్రయాణికుల్లా నటిస్తూ తినుబండారాల్లో మత్తు పదార్థాలను కలిపి ప్రయాణికులకు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ కార్యాలయంలో శనివారం రైల్వే అర్బన్ డీఎస్పీ ఎ.నర్సయ్య కేసు వివరాలు వెల్లడించారు.
బీహార్‌కు చెందిన సతాన్ పటేల్ అలియాస్ సురేందర్సింగ్ (42), వికాస్ పటేల్ అలియాస్ రమేశ్‌సింగ్ (44) కారు డ్రైవర్లు. వీరికి జీతం సరిపోకపోవడంతో రైళ్లలో చోరీలు చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ రైళ్లలో ప్రయాణిస్తూ ప్రయాణికులను పరిచయం చేసుకొని వారికి మత్తు పదార్థాలను కలిపిన తినుబండారాలను ఇచ్చేవారు. వాటిని తిన్న ప్రయాణికులు నిద్రలోకి జారుకోగానే వారి బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను దొంగలించేవారు.
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఒకటో ఫ్లాట్ ఫారం వద్ద వీరిద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వారి బ్యాగ్‌లను తనిఖీలు చేయగా బంగారం, నగదు, మత్తు పదార్థాలు ఉండడంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలను ఒప్పుకున్నారు. వీరి నుంచి 9.4 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1 లక్ష 68 వేల 500 నగదు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 13 కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఈ మీడియా సమావేశంలో రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను, ఎస్ఐ మాజీద్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ నర్సింహ, రవిబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.