హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ)/ వ్యవసాయ యూనివర్సిటీ: డిజిటల్ వ్యవసాయానికి భారత్‌లో అపార అవకాశాలున్నాయని అమెరికా కన్సాస్ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ ఆగ్రానమీ విభాగం హెడ్ ప్రొ.రాజ్ ఖోస్లా అన్నారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాటర్ టెక్నాలజీ సెంటర్లో “పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చర్ అంశం”పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఖోస్లా మాట్లాడుతూ సాగు సవాళ్ల నుంచి అవకాశాలు ఎతుక్కోవాలన్నారు. 1980లోనే ప్రపంచంలోని కొన్ని దేశాలలో ప్రెసిషన్ (డిజిటల్) వ్యవసాయం ప్రారంభమైనదన్నారు. జీపీఎస్, జీఐఎస్, సెన్సర్లు తదితర టెక్నాలజీలు మున్ముందు సాగు రంగంలో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిజిటల్ పద్ధతి అమలు కానుందన్నారు.
వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్స్‌కు మంచి భవిషత్ ఉందన్నారు. పీజేటీఎస్ఏయూ ఆ దిశగా అనేక చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రస్తుత, భవిషత్ అవసరాలకు అనుగుణంగా మార్పు చెందాలని ఖోస్లా పిలుపు నిచ్చారు. మాజీ వీసీ ప్రవీణ్‌రావు నిరంతర కృషి వల్లే టీజేటీఎస్ఏయూకి అంతర్జాతీయంగా, జాతీయంగా మంచి గుర్తింపు వచ్చిందని రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ గుర్తు చేశారు. మౌలిక వసతులలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. వర్సిటీ రూపొందించిన వంగడాలకు ఇతర రాష్ర్టాలలోనూ మంచి గుర్తింపు లభించిందన్నారు.
వర్సిటీ మాజీ ఉప కులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు మాట్లాడుతూ, తరిగిపోతున్న జల వనరులు, వాతావరణ మార్పులు, భూసార క్షీణత తదితర సవాళ్లని వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నదని ఆయనన్నారు. సాంకేతికత, నూతన టెక్నాలజీలతో వాటిని పరిష్కరించుకోవలసి ఉందన్నారు. కాలానుగుణంగా బోధన, పరిశోధన పద్ధతులు మారాలని ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు డా.జగదీశ్వర్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ సీమ, రమణ, డైరెక్టర్ అనిల్ కుమార్, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.