శేరిలింగంపల్లి, జూలై 26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు ఉపాధి కల్పించేందుకు ‘గ్రూమింగ్ ఆన్ వీల్స్’ కార్యక్రమం వినూత్న ప్రయత్నమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని డాగ్ పార్క్‌లో జస్ట్ గ్రూమ్ మొబైల్ పెట్ సెలూన్ వాహనాలను ఆయన ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకంలో అర్హులైన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నదని తెలిపారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దళితబంధు లబ్ధిదారులతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జస్ట్ గ్రూమింగ్ మొబైల్ వాహనాల ద్వారా పెంపుడు కుక్కలకు అవసరమైన సేవలందించడం అభినందనీయమని అన్నారు.
పెంపుడు కుక్కలకు గ్రూమింగ్ చేసేందుకు ఈ వాహనాలు ఎంతగానో తోడ్పాటునందిస్తాయని తెలిపారు. జస్ట్ గ్రూమ్ నిర్వాహకురాలు సాయి చైతన్య మాట్లాడుతూ నగరంలో 5లక్షల పెంపుడు జంతువులు ఉన్నాయని, డాగ్ బాతింగ్, హెయిర్ కట్, హెయిర్ ైస్టెల్, మెడికేటెడ్ బాతింగ్ సౌకర్యాలు ఈ వాహనాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 90300 38100 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, జంతు ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.