మియాపూర్, జూలై 26: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పిస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్, కేపీహెచ్బీ సీఐ కిషన్ వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొమ్మిడం కుమార్ బాబు కొంతకాలంగా నగరంలోని బోరబండలో ఉంటున్నాడు. వేర్వేరు పేర్లతో తాను హౌసింగ్ బోర్డు కార్యాలయంలో పని చేస్తున్నట్లు పలువురిని పరిచయం చేసుకున్నాడు. నెల కిందట కేపీహెచ్బీ 4 వ ఫేజ్లో నివాసముండే నమఃశివాయ అనే వ్యక్తి వద్దకు వచ్చాడు.
ఆ కాలనీలో ఓ మహిళకు మంజూరైన డబుల్ బెడ్ రూం ఇంటి పత్రాలను ఇచ్చేందుకు వచ్చినట్లు చెప్పాడు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు తన ద్వారానే జరుగుతుందని, ఇల్లు కావాలంటే రూ. 2.20 లక్షలు ఇవ్వాలని నమఃశివాయను నమ్మించాడు. అతడి మాటలను నమ్మిన నమఃశివాయ తన తో పాటు మరో ముగ్గురిని జత చేసుకుని మొత్తం రూ. 4.60 లక్షలు ఇచ్చాడు. అనంతరం నిందితుడు కుమార్ బాబు డబుల్ బెడ్రూం మంజారైనట్లు పత్రాలు ఇచ్చాడు. ఈ పత్రాలను మీ సేవలో పరిశీలించగా.. అవి నకిలీవని తేలింది. బాధితులు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కుమార్బాబును అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడని, అతడిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఏసీపీ వెల్లడించారు.