ఖైరతాబాద్, జూలై 26: రాష్ర్టాల విభజనలో ఏపీలో కలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్‌చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాలు భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆ గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని, రాజకీయ కోణంలో చూడకుండా పాలక ప్రభుత్వాలు బాధ్యతతో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజకీయం చేయవద్దని, సమస్యగా గుర్తించి మద్దతునివ్వాలని చెప్పారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు చిత్తశుద్ధి ఉంటే ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలిపేలా కృషి చేయాలని, రాజకీయం చేద్దామనుకుంటే భద్రాచలంలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణలో కలిపితే ముంపు సమస్యను పరిష్కరించుకునే వీలుకలుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే ఆ గ్రామాలను జేఏసీ ఆధ్వర్యంలో పర్యటిస్తామని, తాసీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఆగస్టు 8, 9, తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. సమావేశంలో జేఏసీ కార్యదర్శి సంతోష్, కన్వీనర్ లింగారెడ్డి, నందన్నాయక్, శ్రీమాన్, వరుణ్, తరుణ్, రాజ్, నాగరాజు, గణేశ్, నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.