మేడ్చల్ రూరల్, జూలై 26 : లైంగికదాడులకు గురైన మహిళలు, ఆకృత్యాల బారిన పడిన చిన్నారుల ఆత్మబంధువు ‘భరోసా’ కేంద్రమని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. మేడ్చల్ పట్టణంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని మంగళవారం అదనపు డీజీపీ స్వాతిలక్రా, పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్ హరీశ్‌తో కలిసి డీజీపీ ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ చిన్నారులు, మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
లైంగికదాడుల బాధితులకు భరోసా కేంద్రం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని,మానసికంగా కుంగిపోకుండా కౌన్సెలింగ్ ఇస్తారని పేర్కొన్నారు. కోర్టులో న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా ఉండడంతోపాటు ప్రభుత్వం తరపున పరిహారం, సాయానికి కృషి చేస్తుందని, సమాజంలో తిరిగి నిలదొక్కుకునే బాధ్యత కూడా భరోసా కేంద్రం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. గతంలో ఇలాంటి సాయం లభించకపోవడంతో చాలామంది బాధితులు కేసు నుంచి తప్పుకునేవారన్నారు.
ఒకసారి భరోసా నుంచి సాయం పొందిన వారు జీవితంలో ఎలాంటి సాయం కావాలన్నా తిరిగి కేంద్రాన్ని సంప్రదించొచ్చని సూచించారు. అన్ని జిల్లాల్లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని, త్వరలో గచ్చిబౌలి, శంషాబాద్ జోన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మేడ్చల్‌లో భరోసా కేంద్రం ఏర్పాటుకు సహకరించిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) జోనల్ మేనేజర్ శరత్‌కుమార్, భాగ్యనగర్ గ్యాస్ ఎండీ ముఖేష్‌కుమార్ తివారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదనపు డీజీపీ స్వాతిలక్రా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 11 భరోసా కేంద్రాలు ఉండగా, మరో పదింటిని ఈ ఏడాది చివరినాటికి ఏర్పాటు చేస్తామని తెలిపారు. భరోసా కేంద్రాలు రాకముందు బాధితులకు 20 నుంచి 30 శాతం మందికి న్యాయం జరిగేదని, ఈ కేంద్రాలు వచ్చిన తర్వాత 50 నుంచి 60 శాతానికి పెరిగిందన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ప్రతినిధులు దుర్గేశ్సింగ్, రాజన్న, వీపీజీ రాజు, శ్రీనివాస్, ధనూజ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.