తెలుగుయూనివర్సిటీ, జూలై 26: ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం కింద రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి గ్రంథాలయాన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మంగళవారం జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి 91వ జయంత్యుత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్‌కు డాక్టర్ సినారె సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీనికింద రూ.25 వేల నగదు, శాలువా, జ్ఞాపికను వేణుగోపాల్‌కు అందజేసి సత్కరించారు. పలువురు సాహితీవేత్తలు సృశించిన గ్రంథాలు మైదాకు వసంతం, అక్షరనేత్రాలు, ఆకురాయి, స్నేహగానం, ఉషోదయం, మౌనమేఘాలు, పథగమనం, చైతన్య బావుటా..సుశీలానారాయణరెడ్డి ట్రస్టు నిధులతో ముద్రించగా మంత్రి ఆవిష్కరించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య, ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిల్మానాయక్, కుటుంబసభ్యులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.