సికింద్రాబాద్, జూలై 26: అక్రమంగా నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన నార్త్‌జోన్ పరిధిలో చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా పాడేరుకు చెందిన ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న దాసరి విలాస్ రెడ్డి (32)అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్ నిలయం ప్రాంతం లో గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారంతో తుకా రాం గేట్ పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేసి అతడి వద్ద నుంచి పదిహేను కిలోల గాంజాయిని స్వాధీన ం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ మేరకు నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తుకారంగేట్తో పాటు మరో గాంజాయి కేసులో గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ ఇమ్రాన్(26) అనే వ్యక్తి గాంజాయి విక్రయిస్తు పట్టుబడడంతో అరెస్టు చేసి అతడి వద్ద నుండి మూడు కిలోలన్నర గాంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు చెప్పారు.
విలాస్ రెడ్డి అనే వ్యక్తి విశాఖపట్నం నుండి డ్రై గంజాయి తీసుకొచ్చి రైల్ నిలయం సమీపంలో ఉండే వారికి విక్రయిస్తుండగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్‌తో సంయుక్తంగా దాడులు నిర్వహించిన తుకారంగేట్ పోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి వరంగల్ నుండి డ్రై గంజాయి తీసుకొచ్చి సికింద్రాబాద్ సమీపంలో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు.సమావేశంలో గోపాలపురం ఏసీపీ సుధీర్‌తో పాటు తుకారంగేట్, గోపాలపురం సీఐలు పాల్గొన్నారు.