బేగంపేట్ జూలై 26: వ్యాపార కేంద్రాలకు నిలయమైన సికింద్రాబాద్ పట్టణంలో పాదచారులు ఫుట్‌పాత్‌లపై నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. రో డ్డును, ఫుట్‌పాత్‌లను షాపుల యజమానులు పూర్తిగా ఆక్రమిస్తుండటంతో అవస్థలు పడాల్సి వస్తుంది. చిన్న గల్లీ రోడ్డును కూడా అక్రమార్కులు వదలకుండా వాటిని ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. బేగంపేట్ సర్కిల్ పరిధిలోని మోండామార్కెట్, రాంగోపాల్‌పేట్, బేగంపేట్ ప్రాంతాల్లో పాదచారులు ఫుట్‌పాత్‌లపై నుంచి నడవడానికి ఏ మాత్రం వీలు లేకుండా పోయింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను మొదలుకొని మోండా మార్కెట్, బండిమ్మెట్, సుభాశ్రోడ్, రాణిగంజ్,రాంగోపాల్‌పేట్, సరోజినిదేవిరోడ్, రాష్ట్రపతి రోడ్డు, మహాత్మాగాంధీ రోడ్, టుబాకో బజార్, సర్దార్‌పటేల్ రోడ్, మినిస్టర్రోడ్, బేగంపేట్ ప్రకాశ్‌నగర్, ఓల్డ్ కస్టమ్స్ బస్తీ, పీజీ రోడ్ వాణిజ్య సముదాయాలు గల ప్రాంతాలు. నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రజలు నడవడానికి అన్ని ప్రాంతాల్లో రెండు వైపుల ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. వ్యాపారులు ఫుత్పాత్లను ఆక్రమించి అక్కడ కార్మికులతో పని చేయిస్తున్నారు. మోండామార్కెట్, రాంగోపాల్‌పేట్, బేగంపేట్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకునే ప్రక్రియలో నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు చొరవ తీసుకొని ఆక్రమణలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
బేగంపేట్ సర్కిల్ పరిధిలో రోడ్డును, ఫుట్‌పాత్‌లను ఆక్రమించినట్టు ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటాం. ఆక్రమణ దారులు ఎం తటి వారైన సరే నిబంధనలను ఉల్లఘించినట్టు సమాచారం, ఫిర్యాదు వస్తే ఆక్రమణలను తొలగిస్తున్నాం.
-క్రిష్టాఫర్, ఏసీపీ టౌన్‌ప్లానింగ్