సిటీబ్యూరో, జూలై 23(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యార్థులు అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలను కైవసం చేసుకునేలా మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని టీటా కల్పించింది. అమెరికాలోని టాప్ యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్-డల్లాస్‌తో ప్రత్యక్ష, పరోక్ష విధానంలో ఇంటర్న్‌షిప్ శిక్షణ పొందనున్న విద్యార్థులకు జే1 వీసాకు అవసరమైన డీఎస్ 2019 పత్రాలను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల శనివారం టీ హబ్‌లో అందించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ పత్రాల ఆధారంగా విద్యార్థులు జే-వీసా పొంది అమెరికాలో సెప్టెంబర్ 26 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటల్లీజెన్స్పై ఇంటర్న్‌షిప్ చేయనున్నారని చెప్పారు. అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ – డల్లాస్‌తో టీటా, డిజిథాన్ చర్చలు నిర్వహించి మూడు నెలల ఇంటర్నేషనల్ ఇంటర్న్‌షిప్‌నకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటల్లీజెన్స్పై 2 నెలలు యూటీడీ ప్రొఫెసర్లు వర్చువల్ విధానంలో శిక్షణ ఇస్తారు. ఈ బేసిక్ లెవల్ శిక్షణ, అనంతరం, జే1 వీసాలపై విద్యార్థులు అమెరికా వెళతారని టీటా తెలిపింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ప్రొఫెసర్లు bit.ly/digithon_academy లింక్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని టీటా పేర్కొంది.