చంపాపేట, జూలై 23: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణపతులనే పూజించి, కాలుష్య పెంపును నివారిద్దామని కుమ్మర సంఘం తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్ గాయత్రి నగర్ చౌరస్తాలోని ఆనంద్ బంకెట్ ఫంక్షన్ హాల్లో శనివారం కుమ్మర సంఘం తెలంగాణ రాష్ర్త ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మల్కాజిగిరి దయానంద్ మాట్లాడుతూ, రాష్ర్టంలో కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు మట్టి గణపతులనే పూజించాలని కోరారు. మట్టి గణపతులను తయారు చేసేందుకు రాష్ర్టంలోని 33 జిల్లాల కుమ్మరులు 330 మంది మాస్టర్ ట్రైనర్స్, 3500 మంది కుమ్మర వృత్తిదారులు శిక్షణ పొంది ఉన్నారని తెలిపారు. శిక్షణ పొందిన వారికి రాష్ర్ట ప్రభుత్వం ద్వారా అధునాతన యంత్రాలు అందించాలని కోరారు.
వాటితో వెంటనే గణపతి విగ్రహాల తయారీ మొదలు పెట్టి రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సకాలంలో విగ్రహాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు గుండాల గోవర్ధన్, ప్రచార కార్యదర్శి ఎగిరిశెట్టి వీరయ్య, రాష్ర్త కార్యదర్శి జిల్లెల శంకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మోహన్ కుమార్, నాయకులు యాదయ్య, సుభాష్, ఎగిరిశెట్టి బాల్రాజ్, గోపాల్, చంద్రమోహన్, ఎన్.హనుమంతు పాల్గొన్నారు.