సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాల పండుగలో పోతలింగన్న ప్రాధాన్యత చెప్పక్కర్లేదు. ఊరి పొలిమెర గట్టున కొలువై, అక్క మహంకాళి ఆజ్ఞను పాటిస్తూ.. ఈరగొలలు చేతబూని దుష్టశక్తులను తరిమేందుకు సిద్ధంగా ఉండే నాటి పోతలింగన్నే నేటి పోతరాజు అని ప్రతితి. పాతబస్తీలో సింహవాహిని మహంకాళి అమ్మవారికి అంకితమైన ‘పోసాని’ వంశం 1908 నుంచి ఇప్పటివరకు 114ఏండ్లుగా 8వ తరం పోతరాజులుగా సేవలందిస్తున్నారు. దేహమంతా కుంకుమ, పసుపు రాసుకుని, రెండు చేతుల్లో ఈరగొలలు చేతబట్టుకొని, ప్రతిబోనాల ఊరేగింపులో పోతురాజుగా కీలక ఆకర్షణగా నిలుస్తున్న పోతరాజు పోసాని జ్ఞానేశ్వర్ వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే… 1908లో మా తాత పోసాని బాబయ్య పోతరాజుగా దున్నపోతుపై వెళ్లేవారు.
అప్పుడు మేకలను గావు పట్టేవారు. ఇప్పుడు అన్యపుకాయ గావు పడుతాం. 1982లో మొదటిసారి పోతరాజుగా ఉండి, 27 ఏండ్లు సేవలందించా. ఈ సంప్రదాయాన్ని మరో ఆరుగురికి అందించాం. ప్రస్తుతం మా కుమారుడు అశ్విన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మా పూర్వీకులు అందించిన ఈ సంప్రదాయాన్ని మేము దేవత ఆశీర్వాదంతో కొనసాగిస్తున్నాం. కుటుంబంలోని పెండ్లయిన పురుషులు మాత్రమే ఈ ప్రక్రియలో కొనసాగుతారు. పోతరాజుగా మేం లాల్ దర్వాజ ఆలయానికి మాత్రమే అంకితమయ్యాం అని ముగించారు.