సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మణిహారమైన హుస్సేన్‌సాగర్ తీరం సరికొత్త సొబగులతో ముస్తాబవుతోంది. సాగర తీరంలో ఔరా అనేలా అద్భుతమైన నిర్మాణాలు వస్తున్నాయి. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ తీరంలో లంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లు ఉండగా, వీటి పక్కనే నిర్మాణంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారకం, రాష్ట్ర నూతన సచివాలయం, అక్కడికి సమీపంలోనే ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ల మధ్య 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం వంటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత క్రేజీ కలిగిన ఫార్ములా ఈ-రేసింగ్ జరిగే ప్రాంతంగా సాగర తీరాన్నే ఎంపిక చేసి, దానికి సంబంధించిన పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇవే కాకుండా హుస్సేన్‌సాగర్‌ను ఆధునిక పర్యాటక కేంద్రంగా చరిత్రలో నిలిచిపోయేలా భారీ ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన నిర్మాణాలు ఒక్కొక్కటిగా ఇక్కడ కొలువు దీరనున్నాయి.
పరిపాలన.. పర్యాటకం..
తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకం నూతన సచివాలయం. అలాంటి సచివాలయం చెంతనే పర్యాటకం పరిఢవిల్లేలా చుట్టు పక్కల ప్రాంతాలన్నీ కొత్త రూపంలోకి మారుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ రకరకాల ఆట విడుపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. చుట్టూ ఉన్న వివిధ పార్కులను, ఇతర ఆటవిడుపు కేంద్రాల్లో కేవలం శని,ఆదివారాల్లోనే 2.50 లక్షలకుపైగా సందర్శకులు వచ్చి వెళుతున్నట్లు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి రికార్డులు చెబుతున్నాయి.
మారిన ట్యాంక్‌బండ్..
హుస్సేన్‌సాగర్ ఆనకట్టగా ఉన్న ట్యాంక్‌బండ్‌పై ఇప్పటికే పూర్తి స్థాయిలో సుందీకరణ పనులను హెచ్ఎండీఏ పూర్తి చేసింది. చారిత్రాత్మక నేపథ్యం కనిపించేలా ట్యాంక్‌బండ్‌పై పలు కట్టడాలు చేపట్టారు. అదేవిధంగా లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునీకరించేందుకు ఈ రెండింటినీ కలుపుతూ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు పనులు చేపట్టారు. ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు రూపొందించి, అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేయనున్నారు.
ఫార్ములా ఈ-రేసింగ్..
ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న నిర్వహించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను హుస్సేన్‌సాగర్ తీరంలోని లుంబినీ పార్కు, నూతన సచివాలయంల మధ్య రోడ్డు మార్గంలోనే ప్రత్యేకంగా సర్యూట్ ట్రాక్స్, వీక్షకుల గ్యాలరీ, ఎమోషన్ క్లబ్స్, ఈ-విల్లేజ్, పిట్‌స్టాప్, ఫూట్ ఓవర్ బ్రిడ్జెస్, ఎలక్ట్రికల్ పనులు, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు చేస్తారు.

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం..
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ల మధ్య ఉన్న పార్టీ జోన్ స్థలంలో తెలంగాణ ప్రభుత్వం భారీ అంబేద్కర్ విగ్రహంతో పాటు మెమోరియల్ పార్కును ఏర్పాటు చేయడానికి సుమారు రూ.146 కోట్లను ఖర్చు చేస్తోంది. మ్యూజియం, గ్రంథాలయంతో పాటు నిత్యం వేలాది సందర్శకులు ఈ విగ్రహాన్ని సందర్శించేలా అత్యాధునిక మౌలిక వసతులను కల్పించనున్నారు.

పర్యాటక కేంద్రమే లక్ష్యం..
హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్యాంక్‌బండ్, మరోవైపు ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, పీవీ మార్గం, సంజీవయ్య పార్కు , జలవిహార్, పీవీఘాట్, థ్రిల్ సిటీ, నైట్ బజార్… ఇలా పలు సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని దశల వారిగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. జలవిహార్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్తగా లేక్ వ్యూ పార్కును సరికొత్త డిజైన్లతో నిర్మిస్తున్నారు. గత ఏడాది నెక్లెస్ రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించారు. మరోవైపు సాగర్ జలాల్లో మురుగునీరు, చెత్తాచెదారంతో నిండిపోకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బేగంపేట నాలా వైపు నుంచి సాగర్లోపలికి వచ్చిన వ్యర్థాలను తీసి ఒక గుట్టగా పోసి అందమైన దీవిగా ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించారు. ఇలా హుస్సేన్ సాగర్‌ను నగరంలోనే సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులను హెచ్ఎండీఏ చేపట్టింది.
ఆకర్షణీయంగా అమరవీరుల స్మారకం..
తెలంగాణ అమరుల త్యాగానికి ప్రతీకగా నిలిచేలా అమరవీరుల స్మారకాన్ని అత్యంత ఆకర్షణీయంగా నిర్మిస్తోంది. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో లుంబినీ పార్కు పక్కన, నూతన సచివాలయం ఎదురుగానే భారీ స్థాయిలో దీన్ని నిర్మిస్తున్నారు. అద్భుతమైన డిజైన్లతో అమరవీరుల స్మారకం రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది చివరి కల్లా నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

278 అడుగుల ఎత్తులో సచివాలయం..
హుస్సేన్‌సాగర్ తీరంలో లుంబినీ పార్కు ఎదురుగా అత్యంత విశాలమైన ప్రాంగణం లో, 278 అడుగుల ఎత్తులో నూతన సచివాలయం నిర్మాణంలో ఉంది. లుంబినీ పార్కు ఎదురుగా తూర్పు ముఖంగా సచివాలయం ప్రధాన ద్వారం వచ్చేలా నిర్మాణం చేపట్టనున్నారు. అత్యాధునిక ల్యాండ్ స్కేపింగ్‌తో చూపరులను ఆకట్టుకునేలా సచివాలయం ప్రాంగణం ఉంటుంది. కొత్త సచివాలయం దసరా నాటికి అందుబాటులోకి వచ్చేలా పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.
