మన్సూరాబాద్, జూలై 20: ఎల్బీనగర్ పరిధిలో మంగళవారం నాలుగు అంతస్తుల పైనుంచి పడి మరణించిన 11 ఏండ్ల బాలికది ఆత్మహత్యే అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు బాలికది ఆత్మహత్యగా నిర్ధారించారు. అందుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన సత్యనారాయణరెడ్డి, ప్రభావతి దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు రితిక, వర్షిత (11), లాత్విక ఉన్నారు. ముగ్గురు పిల్లల చదువుల దృష్ట్యా ప్రభావతి ప్రస్తుతం మన్సూరాబాద్ డివిజన్ మధురానగర్‌లో నివాసముంటున్నారు. ప్రభావతి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. అదేవిధంగా వనిపాకల గ్రామ ఎంపీటీసీగా కూడా ఆమె కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా. రెండో కూతురు వర్షిత మన్సూరాబాద్‌లోని శ్రీచైతన్య స్కూల్లో 6వ తరగతి చదువుతున్నది. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు స్కూల్ నుంచి వచ్చిన వర్షిత సుమారు 5:30 గంటల సమయంలో చిప్స్ కొనుకుంటానంటూ తల్లి వద్ద రూ. 20 తీసుకొని దుకాణానికి వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించారు. ఆటోలో చంద్రపురికాలనీకి వెళ్లిన వర్షిత అక్కడున్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి నాలుగో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను చింతలకుంటలోని రెయిన్బో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
బాలికకు వైద్య పరీక్షలు..
బిల్డింగ్ పైకి ఎక్కి దూకి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అనంతరం రెయిన్బో ఆస్పత్రిలోని మహిళా డాక్టర్ల పర్యవేక్షణలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు పోలీసులకు తెలిపారు. వర్షితకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని పోలీసుల దర్యాప్తులో తేలింది. చదువుల్లోనూ వర్షిత ఎంతో చురుకుగా ఉండేదని.. ఎంతో చలాకీగా ఉండేదని తెలిసింది.
బాలిక మృతిపై దర్యాప్తు..
వర్షిత ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఆ ప్రాంతంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు మన్సూరాబాద్‌లోని పెద్ద మసీదు వద్ద నుంచి ఆటోలో ఆమె బయలుదేరినట్లు గుర్తించారు. ఆ సమయంలో సదరు ఆటోలో డ్రైవర్ మినహా మరెవరూ లేరని తేలింది. ఆటోలో కూడా వర్షిత మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకున్న వర్షిత తన తండ్రికి కాల్ చేసింది. ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. చంద్రపురికాలనీలోని బిల్డింగ్‌లోకి బాలిక వెళ్తుండగా.. ఆటో డ్రైవర్ అక్కడున్న వాచ్‌మన్‌ను బాలిక గురించి అడిగాడు. గతంలో ఈ భవనంలోనే నివాసం ఉండి.. వెళ్లిపోయిన అమ్మాయి లాగా ఉన్నది.. అని వాచ్‌మన్ (మహిళ) చెప్పడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. బిల్డింగ్ పైకి వెళ్తున్న బాలికను వాచ్‌మన్ కూడా ఆపేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే ఆమె బిల్డింగ్ పైకి ఎక్కి నాలుగో అంతస్తు పైనుంచి దూకింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆటో డ్రైవర్ పాత్రపై ఆరా తీశారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ ఘటనతో అతడికి ఎలాంటి సం బంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. అదే విధంగా.. ఆ బిల్డింగ్లోనూ ఆమెకు ఎవరూ తెలిసిన వారు కూడా లేరని.. బిల్డింగ్‌పైకి ఎక్కిన కొద్ది నిమిషాల్లోనే కిందకు దూకినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నాం: ఏసీపీ, శ్రీధర్‌రెడ్డి
బాలికది ఆత్మహత్యగా తమ ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఈ విషయంపై బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, ఇంటి పరిసరాల్లో ఉండే వారిని కూడా విచారిస్తున్నాం. బాలికపై ఎలాంటి దాడి జరుగలేదు. ఇంటి నుంచి ఎందుకు అంత దూరం వెళ్లి ఆత్మహత్య చేసుకుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.