నిర్మాత రవికుమార్ రెడ్డిపై దర్శకుడు వర్మ ఫిర్యాదు
ఖైరతాబాద్, జూలై 20 : బ్లాక్ మెయిల్ చేసేందుకే నిర్మాత రవికుమార్ రెడ్డి తాను దర్శకత్వం వహించిన ‘లడ్కీ : ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ చిత్రాన్ని కోర్టు ద్వారా నిలుపుదల చేయించాడని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ మేరకు బుధవారం పంజాగుట్ట పోలీసులకు రవి కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒక సినిమా నిర్మించాలంటే నటీనటులు, టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్టర్లు, ప్రతి సాంకేతిక వర్గం కష్టపడితేనే తెరపైకి వస్తుందని అన్నారు. నిర్మాత ఎన్. రవికుమార్ రెడ్డి స్వార్థంతో తన లెటర్ హెడ్‌పై సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను డబ్బులు బకాయి ఉన్నట్లు తప్పుడు పత్రాన్ని సృష్టించాడని, కోర్టును కూడా తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. కోర్టు స్టే ఇవ్వడం వల్ల ఈ నెల 15వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా నిలిచిపోయిందని అన్నారు. దీంతో సాంకేతికవర్గం, డిస్ట్రిబ్యూటర్లకు తీరని నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. నష్టపోయిన వారందరూ సదరు నిర్మాతపై కేసులు పెట్టాలని, ఆ నష్టాన్ని అతడి నుంచి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదని హెచ్చరించారు.