రవీంద్రభారతి, జూలై 20: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ వార్షికోత్సవం బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ టి.కిషన్‌రావు అధ్యక్షత వహించిగా, గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌదర్రాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్నాతకోత్సవ సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డి పూర్తి చేసిన 73 మంది విద్యార్థులకు ఎంఫిల్ పూర్తి చేసిన 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు డిగ్రీ పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తెలుగు సాహిత్యానుశీలనకు కావ్యాన్ని కవిత్వతత్వాన్ని, కావ్యహేతువులను, కావ్య ప్రయోజనాలను సమీక్షించడానికి సంస్కృత లక్షణ గ్రంధాలపై ఆధారపడకుండా తెలుగులో సమగ్రమైన కావ్యతత్వశాస్త్రం అత్యంత అవసరమని అన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య టి.కిషన్‌రావు విశ్వవిద్యాలయ ప్రగతి నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో 2679 పీజీ, యుజీ పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల 2025 మంది విద్యార్థులకు పట్టాలను ప్రకటించారు.
పీహెచ్డీ, స్వర్ణ పతకం పట్టా పొందిన వారిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నోముల రాజు, నాగజూను సూరేపల్లి, విజయ్‌కుమార్, తాటికాయల భోజన్న, మామిడి హరికృష్ణ ఉన్నారు. అదే విధంగా పీహెచ్డీ పట్టా పొందిన వారిలో గజ్జి మాధవీ లత, మార్గం లక్ష్మినారాయణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్, రాఘవరాజ్‌భట్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నిర్మలా ప్రభాకర్‌తోపాటు వివిధ ప్రాంగణాల పీఠాధిపతులు, విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.