నిరుపేదలకు సేవ చేయాలనే గుణం కొందరిలోనే ఉంటుంది. ఆ కోవకు చెందినదే ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఆకలితో అలమటిస్తూ, చదువుకోలేక పోతున్న కాలనీలకు చెందిన బాలికల జీవితాలను ఈ సంస్థ మార్చేస్తున్నది. వారికి కడుపునిండా భోజనం పెట్టి, చదువు చెప్పి ప్రయోజకులను చేస్తున్నది. ఉద్యోగం కల్పించి వారి కుటుంబానికి సైతం అండగా నిలుస్తూ.. అందరి మనన్నలు పొందుతున్నది.
– సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ )
‘పేద విద్యార్థుల చదువు ఆగిపోకూడదు, ఆర్థిక కారణాలతో వారు పోషకాహారానికి దూరంగా ఉండకూడదు, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థి రాణించాలనే లక్ష్యం’తో ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ కృషి చేస్తున్నది. నగరంలోని కాలనీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ఆ ప్రాంతంలో ఉన్న నిరుపేద బాలికల విద్యను ఆరాతీసి.. వారికి పుస్తకాలు, దుస్తులు, స్కాలర్షిప్లు అందించడంతో పాటు ఆరోగ్యానికి అవసరమయ్యే హైజీన్ కిట్లను సైతం ఉచితంగా అందిస్తున్నది. 2014 నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వందలాది మంది బాలికల జీవితాలను మార్చేసింది.
కాలనీల్లో పర్యటించి..!
అనుభవజ్ఞులైన వలంటీర్ల బృందం కాలనీల్లో పర్యటించి ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యంతో బాధపడుతూ చదువుకోలేక పోతున్న బాలికలను గుర్తిస్తుంది. వారితో కనెక్ట్ కావడంతో పాటు వారి ఆరోగ్యం, స్థితిగతులు, పోషకాహారం గురించి ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రతి బాలికతో 1:1 వీడియో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నది. ‘విరియా’ (సరైన ప్రయత్నం)థీమ్‌తో అర్హులైన బాలికలకు సాలర్ షిప్‌లను అందిస్తున్నది.
కుటుంబాలను తీర్చిదిద్దుతూ..!
అర్హులైన నిరుపేద బాలికలను ఎంపిక చేసి నెలవారిగా స్కాలర్ షిప్‌లను అందజేస్తున్నది. ఎంపికైన ప్రతి బాలిక పేరుతో బ్యాంక్ ఖాతాను తెరిచి అందులో స్కాలర్ షిప్ సాయం జమ చేస్తున్నారు. ఇది వారికి విద్య, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం కోసం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆరోగ్య బీమా, ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన ల్యాప్ టాప్, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక, డిజిటల్ సమ్మిళితం వంటి అన్ని రంగాల్లో సాధికారత కల్పిస్తున్నది. ఈ ప్రక్రియతో బాలికల జీవితాలను మార్చడమే కాకుండా వారి కుటుంబాలను కూడా తీర్చిదిద్దుతున్నది.
సేవ చేయడంలోనేనిజమైన సంతృప్తి : రీనా హిండొక, ఫౌండర్, టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్
టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్‌ను 2014లో స్థాపించాం. ఇది అన్ని రంగాల్లో వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి, ప్రతి మనిషి సామర్థ్యాన్ని పెంచడానికి పనిచేసే ఒక ఎన్జీఓ సంస్థ. మా సభ్యులు, వలంటీర్లు విభిన్న రంగాల్లో పనిచేయడం ద్వారా ప్రపంచంలోని అణగారిన వర్గాలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ‘ప్రాణాలను కాపాడండి, ఆనందాన్ని పంచండి, ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించండి, దయతో కూడిన మార్గంలో ఆశాజనకంగా గౌరవాన్ని పునరుద్ధరించండి.’ఇవే మా నినాదాలు.
ఇలా సంప్రదించవచ్చు
వెబ్సైట్ : touchalifefoundation.com
ఈమెయిల్ : info@touchalife.co
నంబర్ : 9393534373