రవీంద్రభారతి, జూలై 19: నేర రహిత సమాజాన్ని నిర్మించే శక్తి నటులకు మాత్రమే ఉందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలో వంశీ ఆర్ట్స్ థియేటర్స్, వంశీ కల్చరల్ ఎడ్యుకేషనల్ ట్రస్టు, శుభోదయం గ్రూపుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌కు దివంగత భారత ప్రధాని పీవీ నర్సింహారావు వంశీ శుభోదయం జీవన సాఫల్య, స్వర్ణ కంకణ జాతీయ పురస్కారాన్ని ఆయన ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో సినిమా, సీరియల్స్ డైరెక్టర్లు సమాజాన్ని ఉద్ధరించే విధంగా సందేశాత్మక చిత్రాలను నిర్మించాలని కోరారు. అనేక కుటుంబ చిత్రాలలో రాజేంద్రప్రసాద్ నటించి తెలుగు రాష్ర్టాలలో పేరు ప్రఖ్యాతులను గడించారని కీర్తించారు.
సినిమాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండాలని అన్నారు. పీవీ నరసింహారావు జాతీయ పురస్కారాన్ని రాజేంద్ర ప్రసాద్‌కు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి, వంశీ సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, పీవీ నరసింహారావు సోదరుడు పీవీ మనోహర్ రావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం, తెలుగు కళా సమితి డైరెక్టర్ వీఆర్ఆర్ పద్మజ, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కలపటపు, వంశీ అధ్యక్షురాలు డాక్టర్ తేనేటి సుధాదేవి, మ్యాజిక్ ట్రస్టు సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ గీతాలు ప్రతి ఒక్కరినీ అలరించాయి.