ఘట్కేసర్,జూలై 19 : ఘట్కేసర్ వంతెన నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి మల్లారెడ్డికి ఘట్కేసర్ పట్టణవాసులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బి.రాధాక్రిష్ణ ముదిరాజ్, కౌన్సిలర్లు రవీందర్, నర్సింగ్‌రావు, పద్మారావు, నాయకులు వేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జన చైతన్య సేవా సమితి ప్రతినిధులు, గాంధీనగర్, బాలాజీనగర్, వీకర్‌సెక్షన్ కాలనీలు, కొండాపూర్, భోగారం, కీసర ప్రాంతాల ప్రజలు మంత్రి మల్లారెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఘట్కేసర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంతెన నిర్మాణ పనులు మాత్రం పూర్తి కాకపోవడంతో స్థానికులు, దూర ప్రాంత వాహన దారులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణ పనుల కోసం తీసిన గుంతలతో స్థానిక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
బాధితులకు నష్టపరిహారం,డబుల్ బెడ్రూం ఇవ్వాలి..
వంతెన నిర్మాణంలో స్థలాలు, ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వ నష్ట పరిహారంతో పాటు, డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని కోరారు. గతంలో మంత్రి మల్లారెడ్డి ఈమేరకు బాధితులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.