సిటీబ్యూరో, జూలై 17(నమస్తే తెలంగాణ) : డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని..సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తుండగా, తాజాగా ‘మీరు ఆర్డర్ చేశారు… డెలివరీ ఎక్కడ ఇవ్వాలం’టూ ఫోన్లు చేస్తూ.. తికమక పెడుతున్నారు. ‘ఆర్డర్ ఇవ్వలేదంటే.. క్యాన్సిల్ చేస్తాం… ఓటీపీ చెప్పండ’ని కోరుతున్నారు. ఆ సంఖ్య చెప్పగానే.. ఖాతా ఖాళీ అవుతున్నాయి. ఈ తరహాలో మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పౌరులకు ఆన్లైన్ చీటింగ్లపై మరింతగా అవగాహన కల్పిస్తున్నారు.
ముందుగానే వివరాలు…
సైబర్ క్రిమినల్స్ ముందుగానే డార్క్ నెట్ నుంచి మన ఫోన్ నంబర్ ద్వారా బ్యాంక్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను సేకరించుకుంటున్నారు. వాటి ద్వారా ఆన్లైన్లో పలు వాలెట్లలో కొనుగోలు చేసి సిద్ధంగా ఉంటున్నారు. ఆ తర్వాత అమాయకులకు ఫోన్లు చేసి.. ‘మీరు ఆర్డర్ చేశారు కదా.. డెలివరీ చేయడానికి వచ్చాను…ఈ వీధిలోనే ఉన్నాను’.. అని చెబుతున్నారు. ఏ ఆర్డర్ ఇవ్వలేదంటే.. రద్దు చేస్తున్నాను మీకు ఓటీపీ వస్తుంది అది చెప్పండి’ అంటున్నారు. అలా ఓటీపీ చెప్పగానే బాధితుల ఖాతా నుంచి నగదు సెకన్లలో ఖాళీ అయిపోతున్నాయి.
ఓటీపీ ఎవరికీ చెప్పకండి..
ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్) ఆన్లైన్లో జరిపే లావాదేవికి మీకు మాత్రమే వస్తుంది. అది కూడా వెంటనే . ఎవరో చెబితే రాదు. కాబట్టీ ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దు. ఆ సంఖ్య చెప్పారంటే సైబర్ దొంగలకు మీ ఖాతా తాళాలు ఇచ్చినట్లే. ప్రస్తుతం ఈ విధంగా సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి.
– శ్రీధర్, సైబరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ