ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది.. గడిచిన ఐదు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో మహోగ్ర రూపం దాల్చింది.. జన జీవితాలను అతలాకుతలం చేసింది.. వరంగల్, భద్రాద్రి ఏజెన్సీని స్తంభింపజేసింది. పొలాలను ముంచేసింది.. గ్రామాలను ఖాళీ చేయించింది.. వేలాది మందిని నిరాశ్రయులను చేసింది.. వారిని పరామర్శించి వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని పరామర్శించారు.. ‘ఎవరూ ఆందోళన చెందవద్దు.. మీకు నేనున్నాను’ అని భరోసా కల్పించారు.. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అండగా ఉంటారని,వరదలు తగ్గే వరకు ములుగులో ఒక హెలికాప్టర్, భద్రాచలంలో మరొక హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచుతామని తెలిపారు.
వరద తక్షణ సహాయం కింద ములుగు జిల్లాకు రూ.2 కోట్ల 50 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.2 కోట్ల 30 లక్షలు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్‌కు రూ. కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున నగదు, 20 కిలోల చొప్పున బియ్యం తక్షణ సాయంగా అందిస్తామని పేర్కొన్నారు. భద్రాచలం పర్యటన అనంతరం హెలికాప్టర్లో ఏటూరునాగారం దిశగా ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన రామన్నగూడెం చేరుకుని పుష్కరఘాట్ వరకు రెండు కిలోమీటర్ల మేర గ్రామస్తులతో కలిసి కాలినడకన పర్యటిస్తూ గోదావరి నది ప్రవాహాన్ని పరిశీలించారు. గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీరె, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు.