ఖైరతాబాద్, జూలై 17: అత్యవసర పరిస్థితుల్లో సమయానికి రక్తదానం చేయడం ద్వారా అమాయకుల ప్రాణాలను రక్షించవచ్చని రోటరీ క్లబ్ 3150 గవర్నర్ టి. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజిగూడలోని జాయ్ ఆస్పత్రిలో రోటరీ చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని రాజశేఖర్ రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ శరత్ చౌదరి, జాయ్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ చంద్ర కాట్రాగడ్డ, సీఈవో డాక్టర్ సంజీవ్ తపాడియా, డాక్టర్ విభా బియానీతో కలిసి ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో పాటు వివిధ రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వికాస కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
తద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో అత్యవసర పరికరాలను అందిస్తున్నామన్నారు. అలాగే మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం, రైతు సదస్సు లాంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు, డోనర్స్‌కు అనుసంధానం పనిచేస్తున్నామన్నారు. రేర్ గ్రూప్ బ్లడ్‌ను సేకరించడంతో పాటు అవసరమైన వారికి అందించడంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదలందరికీ ఉచితంగా రక్తాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత రక్తనిధిలో అత్యాధునిక యంత్రాలను సమకూర్చుకున్నట్లు తెలిపారు.