సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను చెల్లించని యజమానులకు ప్రభుత్వం అద్భుత అవకాశాన్ని కల్పించింది. ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని కేవలం 10శాతం వడ్డీతో ఏకకాలంలో పూర్తిగా చెల్లించి, వడ్డీపై 90శాతం మాఫీని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వచ్చే అక్టోబర్ 31వరకు ఈ స్కీం అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ బకాయిలను పూర్తి వడ్డీతో ఈ ఏడాది ఏఫ్రిల్ 1 నుంచి జూలై 16 మధ్య చెల్లించి ఉంటే.. వారికీ ఓటీఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు చెల్లించిన వడ్డీలో 90శాతం వెనక్కు ఇవ్వనున్నది. ఈ మొత్తాన్ని భవిష్యత్తు ఆస్తిపన్ను డిమాండ్‌లో సర్దుబాటు చేస్తారు.
జీహెచ్ఎంసీకి రావాల్సింది రూ.1500 కోట్లు
కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 17.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఇందులో రెండు నుంచి మూడు లక్షల మంది పన్ను చెల్లించక బకాయిదారుల జాబితాలో చేరారు. వీరి నుంచి వడ్డీతో కలిపి రూ.1500కోట్ల మేర బకాయిల రూపంలో రావాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా ఓటీఎస్ అవకాశం కల్పించడం పట్ల వడ్డీ తీసేస్తే దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే 2020 ఆగస్టు 1న ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2020 సంవత్సరంలో ఓటీఎస్‌తో రూ.550 కోట్ల మేర పన్నులు రాబట్టుకున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1635 కోట్లు వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022-23లో మొత్తం రూ.2వేల కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఆస్తిపన్ను చెల్లించే విధానం
urlకు వెళ్లండి. httpsఃptghmconlinepayment.cgg.in/ptonlinepayment.do 10 అంకెల పీటీఐఎన్ (ptin), మొబైల్ నంబరు, ఇ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. మై జీహెచ్ఎంసీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేయవచ్చు. చెల్లింపు విధానాన్ని ఎంపిక చేసుకుని ఆస్తిపన్ను చెల్లించాలని అధికారులు కోరారు. ఓటీఎస్ స్కీంపై విస్తృత ప్రచారం చేయడంతో పాటుగా ప్రతివారం మంగళవారం, గురువారం, ఆదివారం ఆయా సర్కిల్ కార్యాలయాల్లో రెవెన్యూ మేళాలు నిర్వహించనున్నారు.