సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): ఒకప్పుడు పార్సిల్ సేవలకు పోస్టాఫీసులు, ప్రైవేట్ కేంద్రాలు బాసటగా నిలిచేవి. కాలం మారుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సైతం మార్పు కోరుకుంది. ఊరు నుంచి పట్టణానికి, పట్టణం నుంచి ఊర్లకు సామగ్రిని చేరవేసే సేవలను ఇటీవల చేపట్టి విజయవంతంగా పార్సిల్ సేవలను “టీఎస్ ఆర్టీసీ – కార్గో..” పేరిట వినియోగదారులకు అందిస్తున్నది. బిర్యానీ, పాలకోవ, టమాట సాస్, పూలు, కూరగాయలతో పాటు కంప్యూటర్లు, మెడికల్ కిట్లు, ఇలాంటి పార్సిల్ డెలివరీ సర్వీసులకు ఆర్టీసీ కార్గో ప్రస్తుతం చిరునామాగా మారింది. ఇది, అది, అనేదేమీ లేదు.. అగ్గిపెట్టె.. సబ్బు పెట్టే నుంచి అన్ని రకాల పార్సిళ్లను బుక్ చేసుకోవడం, కస్టమర్‌కు డెలివరీ చేయడంలో ఆర్టీసీ పార్సిల్ సర్వీసు విజయవంతంగా దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టకొచ్చిన ఆర్టీసీ కార్గో అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నది. ఫాస్ట్ డెలివరీ, నమ్మకమైన డెలివరీగా పేరు సంపాదించుకున్న ఆర్టీసీ పార్సిల్ సర్వీసు వ్యవస్థ మరో అడుగు ముందుకేసింది. ఈ నెల కొత్తగా హోమ్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో కూడా ఆర్టీసీ పార్సిల్ సర్వీసు తనదైన ముద్ర వేసుకుంటున్నది.
డోర్ డెలివరీకి 44 కేంద్రాలు..
ప్రైవేటు పార్సిల్ సర్వీసుల కంటే 50 శాతం తక్కువ ఛార్జీలతో పాటు నమ్మకమైన వ్యవస్థగా పేరు సంపాదించుకున్న ఈ విధానం గ్రేటర్ హైదరాబాద్‌లో ఆరు కేంద్రాలతో ప్రారంభించిన హోమ్ డెలివరీ సర్వీసు ఇప్పటి వరకు 44 కేంద్రాలకు విస్తరించింది. దీంతో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట్ వంటి రాష్ట్ర నలుమూలల ఉన్న జిల్లా, మండలాల నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక వంటి రాష్ర్టాల నుంచి కూడా పచ్చళ్లు, ఇతర గృహవసరాలను హోమ్ డెలివరీ చేస్తున్నామని, అందుకు ప్రైవేటు సంస్థలు కూడా ఆర్టీసీ పార్సిల్ సర్వీసులను వినియోగించుకుంటున్నారని ఆర్టీసీ కార్గో గ్రేటర్ జోన్ అధికారి జగన్ తెలిపారు. భవిష్యత్తులో ట్రాన్స్‌పోర్టుకు అనుకూలంగా ఉండే అన్ని రకాల వస్తువులను ఆర్టీసీ కార్గో ద్వారా డోర్ డెలివరీ చేయడానికి ఆర్టీసీ తమ సేవలను విస్తరించడానికి నిత్యం సరికొత్త విధానాలను అవలంభిస్తుందన్నారు.
నగరంలో డోర్ డెలివరీ కేంద్రాలు…
మూసాపేట్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బాలానగర్ టౌన్షిప్, ఎస్సార్‌నగర్, రాజ్ భవన్, హెచ్ఏఎల్ టౌన్షిప్, యూసుఫ్‌గూడ, మియాపూర్, చందానగర్, హెచ్ఎంటీ టౌన్షిప్, గాజుల రామారం, నేరేడ్మెట్, ఈసీఐఎల్, కూకట్పల్లి, సోమాజిగూడ, జేఎన్టీయూ హైజింగ్ బోర్డు, నిజాంపేట్, సైనిక్‌పురి, మోతీనగర్, బేగంపేట్ పోలీస్‌లైన్, హబ్సిగూడ, కార్ఖాన, బోయినపల్లి, అంబర్పేట్, తిరుమలగిరి, బేగంపేట్, లాలాపేట్, జమిస్తాన్పూర్, హిమాయత్‌నగర్, నెహ్రూనగర్, ఉప్పల్, మౌలాలి, నల్లకుంట(విద్యానగర్), మల్కాజిగిరి, శీతాఫల్మండి, నాగోల్ రైల్ నిలయం, నాచారం, కవాడిగూడ, బోడుప్పల్
(చెంగిచెర్ల).