కొండాపూర్, జూలై 11 : యానిమల్ బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్‌లోని ప్రాథమిక రంగాల్లో పరిశోధనలు మరింత మెరుగుపరిచేందుకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ)ల మధ్య సోమవారం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా యానిమల్ బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్‌లోని ప్రాథమిక రంగాలపై సహకారం, రెండు సంస్థల నుంచి అధ్యాపకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, విజిటింగ్ ఫ్యాకల్టీలను పరస్పరం మార్చుకునే అవకాశం ఉంటుంది.
యానిమల్ సైన్సెస్‌లో పరిశోధనలు రెట్టింపు చేయడంతో పాటు మెరుగైన పరిశోధనలను సాధించడం కోసం ఐదేండ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుందని వర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఎన్ఐఏబీకి చెందిన శాస్త్రవేత్తలు వర్సిటీలో అనుబంధ ప్రొఫెసర్లుగా నియమితులవనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజే రావు సమక్షంలో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేశ్ నిగమ్, ఎన్ఐఏబీ డైరెక్టర్ డాక్టర్ జీ తరు శర్మ, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ ఎన్.శివకుమార్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ నాగేంద్ర ఆర్.హెగ్డే, ప్రొఫెసర్ పి.జగన్మోహన్ రావు, డాక్టర్ ఆనంద్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.