బంజారాహిల్స్, జూలై 11: రాజ్యాంగ రచన సమయంలో దేశ ఆర్థిక, సామాజిక, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు భవిష్యత్‌లో భారతదేశంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగా ఊహించి అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన డా.బీఆర్.అంబేద్కర్‌ను మించిన జాతీయతావాది ఎవరూ లేరని హర్యానా ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డా.రాజశేఖర్ వుండ్రు అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ‘అంబేద్కర్- ప్రజాస్వామ్యం- జాతీయవాదం’ అనే అంశంపై సోమవారం అంతర్జాతీయ సదస్సు జరిగింది.
పెన్సిల్వేనియాలోని లాక్ హెవెన్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ఆచార్యులు లక్షణ్ డీ సత్య మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరం తర్వాత విభిన్న రాజ్యాలను సమాఖ్య దేశంలో కలిపేందుకు అంబేద్కర్ చేసిన కృషిని మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ. కె.సీతారామారావు, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. యశదత్తా, ప్రొ.నరేందర్ కుమార్, ప్రొ.దాసన్ పాల్గొన్నారు.