మేడ్చల్, జూలై11(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానలలో అన్ని రకాల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు అందించే 11 ప్రభుత్వ దవాఖానలలో నెలలో ఒక రోజు జిల్లా వైద్యాధికారి, డిప్యూటి డీఎంహెచ్‌వో, వైద్యాధికారులు నిద్రించేలా వైద్యశాఖ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు వైద్య శాఖ దవాఖానలలో నెలలో ఒక రోజు నిద్రించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలోని ఉప్పల్ పీహెచ్సీలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ నిద్రించిన రోజున రాత్రి వెళల్లో వైద్య సేవలను స్వయంగా అందించి వైద్యులకు ఆదర్శంగా నిలిచారు.
ఆ 11 దవాఖానలు ఇవే..
1. ఉప్పల్(పీహెచ్సీ), 2. వెంకట్‌రెడ్డినగర్(ఉప్పల్-యూపీహెచ్సీ), 3. కీసర(పీహెచ్సీ), 4. అల్వాల్(పీహెచ్సీ), 5. బాలానగర్(పీహెచ్సీ), 6. దుండిగల్(పీహెచ్సీ), 7. జవహర్నర్(పీహెచ్సీ), 8. శామీర్‌పేట్(పీహెచ్సీ), 9. మల్కాజిగిరి(పీహెచ్సీ), 10. మల్లాపూర్(పీహెచ్సీ), 11. షాపూర్‌నగర్(యూపీహెచ్సీ)
24 గంటల వైద్య సేవలు
జిల్లాలో అత్యవసర వైద్య సేవలు అందించే దవాఖానలలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నాం. వివిధ పరీక్షలకు సంబంధించి డయాగ్నోస్టిక్ సేవలను వినియోగించుకుంటున్నాం. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు 24 గంటల వైద్య సేవలు అందించే పీహెచ్సీలలో నెలలో ఒక రోజు వైద్యాధికారులతో పాటు నేను కూడా నిద్రించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నాం.
– పుట్ల శ్రీనివాస్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి