జీడిమెట్ల, జూలై 11 : జీడిమెట్ల పారిశ్రామిక వాడ అనుబంధంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర కో అపరేటివ్ సొసైటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఏఆర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా యూనిట్-2 పరిశ్రమలో సోమవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్ల అగ్ని మాపక కేంద్ర అధికారి వి.సుభాష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఎస్వీ కో ఆపరేటివ్ సొసైటీలోని ప్లాట్ నంబర్ 33లో ఉన్న ఏఆర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా పరిశ్రమలో కార్మికులు రెండు రియాక్టర్ల వద్ద పనిచేస్తున్నారు. రియాక్టర్లలో ఉన్న రసాయనాలను శుభ్రం చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి.
అక్కడ పనిచేస్తున్న కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. జీడిమెట్ల అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సుభాష్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని జీడిమెట్ల సీఐ ఎం.పవన్ దృష్టికి తీసుకురాగా ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.