సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్లాట్ కొనుగోలుదారుడి పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తూ.. లోన్ రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బాధితుడికి రూ.8 లక్షలు రీఫండ్ చేయాలని శ్రీ కార్తికేయ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.ప్రసన్నలక్ష్మిలతో కూడిన బెంచ్ ఆదేశించింది. నగరంలోని మయూరీనగర్కు చెందిన ఎర్రబెల్లి రాజు 2020 ఫిబ్రవరి 17న గాగిల్లాపూర్‌లో 150 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం లోన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు శ్రీకార్తికేయ కంపెనీ హామీ ఇవ్వగా, సంస్థకు రూ.17 లక్షలు చెల్లించాడు. హెచ్డీఎఫ్సీ నుంచి లోన్ తీసుకోవాలంటూ కొనుగోలుదారుడికి సూచించగా..
అందుకు అనుగుణంగా డాక్యుమెంట్లు అందజేశాడు. కాగా, మోసపూరిత ఉద్దేశంతో శ్రీకార్తికేయ లైఫ్‌స్పేసెస్ ప్లాట్ నంబర్ 79కి బదులుగా 82గా మార్చింది. దీంతో రుణం అందించేందుకు సంబంధింత బ్యాంక్ తిరస్కరించింది. రాజు తన డబ్బును చెల్లించాల్సిందిగా శ్రీకార్తికేయ ప్రతినిధులను కోరగా.. రూ.8,99,851 ఇచ్చారు. మిగిలిన రూ.8,01,149 అడిగితే… ఎలాంటి స్పందన లేకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. పరిశీలించిన కమిషన్.. 9 శాతం వడ్దీతో రూ.8,01,149 బాధితుడికి రీఫండ్ చేయాలని శ్రీకార్తికేయ లైఫ్‌స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆదేశించింది. రూ.25వేలు నష్టపరిహారంగా, రూ.15వేలు కేసు ఖర్చుల కింద చెల్లించాలని సూచించింది.