సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇటీవల కాలంలో చాలా మంది తమ ఇంటి గోడలను ఆకర్షణీయమైన రూపాలతో నింపేస్తున్నారు. పక్షులు, జంతువులు, మొక్కల బొమ్మలతో జీవకళ ఉట్టిపడేలా, ఆకట్టుకునేలా కళాకారులు ఇండ్లకు సొబగులు అద్దుతున్నారు. ఇంపైన ఇంటీరియర్ గది అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంటికి కొత్త శోభనిస్తుంది. అందుకే గాజు బొమ్మలు, చెక్క విగ్రహాలు, రాతి ప్రతిమలతో కూడా గదులను అందంగా అలంకరించుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నేరుగా గోడలపై పెయింటింగ్స్‌కు ప్రాముఖ్యత ఇస్తుంటే.. మరికొందరు కాన్వాస్‌పై వేసి అమర్చడాన్ని ఇష్టపడుతున్నారు. ఇండ్లల్లోనే కాదు..ఫాంహౌస్ల్లోనూ గోడలకు పెయింటింగ్స్ వేయిస్తున్నారు. కాగా, పెయింటింగ్ వర్క్ చేయాలంటే కనీసం పది రోజుల నుంచి నెల రోజుల వరకు సమయం పడుతుంది. రూ.50వేల నుంచి పది లక్షల వరకు కళాకారులకు ప్రాజెక్టులు వస్తున్నాయి.
నచ్చినట్టుగా తీర్చిదిద్దుతాం
చాలా ఖర్చు పెట్టి ఇంటిని నిర్మించుకుంటారు. ఆ ఇల్లు తమకు నచ్చినట్టుగా ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతారు. అయితే ఇటీవల కాలంలో ఇంట్లో గదులకు అనుగుణంగా పెయింటింగ్స్ వేసుకోవడం పెరిగింది. మేం నాలుగు ప్రాజెక్టులు చేస్తున్నాం. ఫాంహౌస్‌లలో కూడా పనిచేస్తున్నాం. చిన్నారుల గదిలో గోడలకు కార్టూన్స్, దేవుడి గదిలో వారికి నచ్చిన చిత్రపటాలు, హాల్లో కాన్వాస్‌పై వేసిన చిత్రాలను అమర్చుతున్నాం. విభిన్నరకాల పెయింటింగ్స్‌తో ఆ ఇల్లు ఆహ్లాదాన్ని పంచుతుంది.
-సత్య, ఆర్టిస్టు
మరువలేని అనుభూతి
నచ్చిన పెయింటింగ్ చూస్తూ ఉంటే వచ్చే ఆ అనుభూతి మరువలేనిది. చాలా మంది ఎగ్జిబిషన్లలో పెయింటింగ్స్ చూసి లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. అవి ఇండ్లల్లో పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ ట్రెండ్ నగరంలో విస్తరించింది. చాలా ఇండ్లల్లో పెయింటింగ్స్ వేసుకుంటున్నారు. కాన్వాస్ చిత్రాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.
-అంబరీశ్, ఆర్టిస్టు
బొమ్మలు, ప్రకృతి దృశ్యాలపై ఆసక్తి
అనేక టెన్షన్లతో ఇంటికి వెళ్తాం. మనకు ఇల్లు ఒక ప్రశాంతతను ఇచ్చేలా ఉంటుంది. ఆ మేరకు ఇంటిని నచ్చినట్టుగా రూపొందించుకోవాలి. అందుకే చాలా మంది వారికి ఎంతో ఇష్టమైన బొమ్మలు, ప్రకృతి దృశ్యాల పెయింటింగ్స్‌ను వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మేం ఫాంహౌస్ ప్రాజెక్టు కూడా చేస్తున్నాం. రూ.12 లక్షల వరకు ప్రాజెక్టు వ్యయం.
-ప్రసన్న, ఆర్టిస్టు