పీర్జాదిగూడ, జూన్ 26: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. ఘట్కేసర్ మండలం తిమ్మాయిగూడానికి చెందిన కె. ప్రవీణ్‌చారి, కవిత(30) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. కవిత 5 నెలల గర్భవతి. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కవిత అనారోగ్యంతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ ఉప్పల్ డిపో సమీపంలో ఉన్న కౌండిన్య ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించాడు. వెంటనే కవితను కౌండిన్య ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో వైద్యులు పరీక్షించి అబ్జర్వేషన్లో ఉంచాలని సూచిస్తూ అడ్మిట్ చేసుకున్నారు.
ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కవితకు రక్తస్రావం కావడంతో.. వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లి అబార్షన్ చేశారు. ఈ క్రమంలో అబార్షన్ వికటించి మృతి చెందిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అబార్షన్ విటించడంతో వైద్యులు, సిబ్బంది ఆస్పత్రి వెనుక గేటు నుంచి పరారయ్యారు. మూడు గంటలైనా ఎంతకీ వైద్యులు బయటకు రాకపోవడంతో మృతురాలి కుటుం బసభ్యులు లోపలికి వెళ్లి చూడగా ఎవరూ కనిపించలేదు. కవిత మరణించి ఉంది. మృతిరాలి భర్త ప్రవీణ్‌చారి, ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యులు, సిబ్బంది అంతా పరారు కావడంతో మృతిరాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కవిత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.
ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది రావాలం టూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీహెచ్ఎంవో నారాయణరావు, ప్రభు త్వ వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకుని వైద్య విధానం, మందులను పరిశీలించారు. మేడిపల్లి పోలీసులకు ఆస్పత్రి వద్దకు వచ్చారు. ఆస్పత్రి యాజమాన్యం రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ గోవర్ధనగిరి తెలిపారు.