సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీలకు సంబంధించిన నియామకాల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, తెలుగు యూనివర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వంటి యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయ్యింది. అయితే, ఈ యూనివర్సిటీల పరిధిలో ఉన్న టీచింగ్, నాన్ టిచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు ప్రత్యేక నియామక బోర్డు పరిధిలోకి వెళ్తుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు ఓయూ, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీలలో అధిక పోస్టులు ఉండటంతో నిరుద్యోగులంతా ఆ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని శాఖల్లో నియామకాల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీల్లో ఉన్న పోస్టుల భర్తీకి కూడా లైన్ క్లియర్ అయ్యిందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ ఎన్.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
ఖాళీల వివరాలు ఇలా..
ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం 872 పోస్టులు ఉన్నాయి. వాటిలో ప్రొఫెసర్ పోస్టులు 14, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 416, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 442 ఉన్నాయని తెలిపారు. అలాగే, నాన్ టీచింగ్ క్యాటగిరీలో దాదాపు 680 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అలాగే, జేఎన్టీయూలో మొత్తం 347 పోస్టులు భర్తీ కోసం యూనివర్సిటీ ప్రకటించింది. అయితే, అందులో ప్రొఫెసర్ పోస్టులు 54, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 102, అసిస్టెంట్ ప్రొఫెసర్ 191 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే, ఈ యూనివర్సిటీలో 115 నాన్ టీచింగ్ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు 66, నాన్ టీచింగ్ క్యాటగిరీలో 84 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 48 టీచింగ్ పోస్టులు ఉండగా.. నాన్ టీచింగ్ క్యాటగిరీలో 90 వరకు ఖాళీగా ఉన్నాయన్నారు. అయితే, నియామకాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డు ఆధ్వర్యంలో పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.