సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో వర్షాకాల సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. విపత్తును ఎదుర్కొని ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి భారీ వర్షాలు కురిసిన రోడ్లపై నీరు నిలవకుండా పటిష్ట చర్యలు తీసుకునేలా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ మేరకు వర్షాకాల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలకు గానూ దాదా పు రూ.36.98 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌తో మాన్సూన్ యా క్షన్ ప్లాన్‌ను ఖరారు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి 168 మాన్సూన్ అత్యవసర బృందాలను రంగంలోకి దింపింది. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు ఉండగా, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్స్‌ను నియమించారు.
ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జితో పాటు ఇద్దరిని కేర్ టేకర్‌గా నియమించనున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద అంచనా బట్టి దిగువకు చెరువు నీటిని విడుదల చేయడం, ఎప్పటికప్పుడు చెరువుల వరదపై అప్రమత్తంగా ఉండటం లాంటి చర్యలు చేపట్టనున్నారు. అంతే కాకుండా నాలాలతో పాటు చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం చేపట్టాలని నిర్ణయించారు.
మాన్సూన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏరియాల వారీగా 168 బృందాలను రంగంలోకి దింపనున్నా రు. వీరంతా కేటాయించిన ఆయా ప్రాంతాలలో వరద నీరు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టనున్నా రు. ఇక భారీ వాహనాలతో నలుగురితో కూడిన 64 బృందాలు, మినీ మొబైల్‌తో 104 బృందాలు డీఆర్ఎఫ్ టీంతో కలిసి సహాయక చర్యలు చేపట్టనున్నారు. సెల్లార్స్, ఇతర నీరు నిలిచిన ప్రాంతాలలో వరద నీటి మళ్లింపునకు 237 పంప్సెట్స్ను సిద్ధం చేశారు.
స్టాటిక్ లేబర్ – ఒకరు లేదా ఇద్దరు నీరు నిలిచిన ప్రాంతాలు, క్యాచ్‌పిట్ (గుంతలు) ఉన్న ప్రాంతాలలో సహాయక చర్యలు చేపడతారు.
మినీ మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు – ఒక్కో వాహనం (టాటా ఏసీ/జీపు)లో నలుగురు కార్మికులు ఉంటారు. నీరు నిలిచిన ప్రాంతాలలో మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. వీరితో పాటు మొబైల్ ఎమర్జెన్సీ టీంలో ఒక్కో వాహనం (డీసీఎం/ట్రాక్టర్, ట్రాలీ)లలో నలుగురు బృందంతో చెట్లు విరిగిన పడిన, నీరు నిలిచే ప్రాంతాలలో సహాయక చర్యలు చేపడతారు.
సీఆర్ఎంపీ పథకంలో ఆయా ఎజెన్సీలు 29 అత్యవసర బృందాలను ఖరారు చేశారు. కాగా, అత్యవసర బృందాలు రక్షణ పరికరాలను అందజేశారు.
జోన్ల వారీగా ఇన్చార్జిల నియామకం
వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. నష్ట నివారణకు నాలాల పొడవునా వరద ప్రభావం ఉండి, తలెత్తే సమస్యలను నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు ప్రత్యేకంగా నిర్వహ ణ విభాగాన్ని నియమించింది. జోన్ల వారీగా ఇన్చార్జిలను నియమించి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలో 74 ప్రభావిత ప్రాంతాలకు గాను 76 మందిని నియమించారు. అదే విధంగా చార్మినార్ జోన్‌లోని 52 ప్రాంతాలకు 32 మంది అధికారు లు, ఖైరతాబాద్‌లో 71 కాలనీలకు 81 మంది, శేరి లిం గంపల్లిలో 52 ప్రాంతాలకు 52 మంది, కూకట్‌పల్లిలో 48 ప్రాంతాలలో 49 మంది అధికారులు, సికింద్రాబాద్ జోన్లో 55 పాయింట్లలో 79 మంది ఆఫీసర్లను ఇన్‌చార్జీలుగా నియమించారు.
వరద నీటి కాల్వల బలోపేతం
జీహెచ్ఎంసీ పరిధిలోని 468 వరద నీటి కాల్వల నిర్మాణ పనులకు గాను రూ.298.34 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 279 చోట్ల పనులు పూర్తి కాగా, ఇందుకోసం రూ.139.78 కోట్లను ఖర్చు చేశారు. రూ.94.11 కోట్లతో చేపడుతున్న మరో 98 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.5.82 కోట్ల విలువ జేసే 19 పనులు వివిధ కారణాలతో రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
నాలాల అభివృద్ధి, విస్తరణకు గాను ఎస్ఎన్డీపీ పథకాన్ని చేపట్టారు. తొలి విడతగా రూ.747.45 కోట్లతో 37 చోట్ల పనులు చేపట్టారు.