సిటీబ్యూరో, జూన్ 20(నమస్తే తెలంగాణ) : రుణ యాప్ సంస్థలు ఎవరినీ వదలడం లేదు. యువతీ, యువకులకు రుణాల పేరుతో ఆశ చూపి, రుణం అందజేసి వసూళ్ల పేరుతో తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నాయి. చిన్న వయస్సులో అప్పుల ఊబీలో కూరుకుపోతున్న యువత ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రుణ యాప్ సంస్థల వేదింపులు తాళలేని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముగ్గురు విద్యార్థినులు ఇటీవల పోలీసులను ఆశ్రయించి వారి గోడును వెళ్లబోసుకున్నారు. రుణ యాప్‌ల ద్వారా రుణం తీసుకుంటే రణం తప్పదని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
పుస్తకాల కోసం రుణం.. ఆశ్లీల ఫొటోలు ఫోస్ట్
ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతున్నది. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండటంతో పుస్తకాల కోసం ఇంట్లో డబ్బులు అడిగింది. కుటుంబ సభ్యులు డబ్బులు లేవని చెప్పడంతో విద్యార్థిని రుణ యాప్ నుంచి రూ.3 వేలు తీసుకున్నది. తీసుకున్న రుణాన్ని కట్టేసింది. అయినా.. రుణ యాప్ సంస్థల నిర్వాహకులు ఫోన్ చేసి ఇంకా డబ్బులు కట్టాలని వేధిస్తున్నారు. విద్యార్థిని ఫొటోను మార్ఫింగ్ చేసి పలు అశ్లీల వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. దీంతో ఆ మార్ఫింగ్ ఫొటోను దాదాపు 30 వేల మందికి పైగా చూశారు. ఈ విషయం తెలిసిన వారి నుంచి సమాచారం రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన విద్యార్థిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ తరహ వేధింపులకు గురైన ముగ్గు రు విద్యార్థినీలు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు.
ఆర్బీఐ అనుమతి ఉంటేనే తీసుకోండి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాచకొండ షీ టీమ్స్ డీసీపీ సలీమా నేతృత్వంలో దాదాపు 8 షీ టీమ్స్ బృందాలు జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రుణాల కోసం గుర్తు తెలియని యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లో ప్రతి అంశాన్ని వీక్షించేందుకు వారు అనుమతి తీసుకుని చొరబడుతారని వివరించారు. వాటికి యాక్సిస్ ఇవ్వకపోతే మీకు యాప్ డౌన్లోడ్ కాదు. మీకు తెలిసిన సంస్థలు, ఆర్బీఐ అనుమతి ఉన్న ఫైనాన్స్, బ్యాంక్‌ల నుంచే రుణా లు తీసుకోవడం మంచిదని తెలుపుతున్నారు. యాప్‌లకు యాక్సిస్ ఇచ్చి మీరు రుణం తీసుకుంటే ఇక మీ కు ప్రతి రోజు నరకమేనని పోలీసులు హెచ్చరిస్తున్నా రు. రుణం చెల్లించినా వారి వేధింపులు ఆగవని నమోదైన కేసు స్టడీలను విద్యార్థులకు వివరిస్తున్నారు. మా ర్ఫింగ్తో వారు చేసే గలీజు చేష్టల గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇప్పటికైనా రుణ యాప్‌ల నుం చి లోన్లు తీసుకోవద్దని పోలీసులు తెలుపుతున్నారు. ఎవరికైనా రుణ యాప్ సంస్థల నుంచి వేధింపులు ఉంటే వెంటనే డయల్ 100 లేదా రాచకొండ షీ టీ మ్స్ 9490617111కు ఫిర్యాదు చేయాలని డీసీపీ సలీమా కోరారు.