కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 20: హైదరాబాద్ మహా నగరం ఆధునిక పోకడలు సంతరించుకొని అభివృద్ధి దిశగా పరుగు పెడుతోంది. పలు కాలనీలను కలుపుకుంటూ ట్రాఫిక్ కష్టాలు తొలిగిపోయేలా పలు రకాల రహదారులను నిర్మించుకుంటున్నాం. దీంతో రోజు రోజుకూ నగరంలోని పలు నియోజకవర్గాలు, కాలనీలు, బస్తీల మధ్య దూరం తగ్గి దగ్గరవుతున్నాయి. కూకట్పల్లి ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చే కైత్లాపూర్ ఆర్వోబీ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. హైటెక్ సిటీ సమీపంలోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, పరిసర ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధిని సాధించడంతో కూకట్‌పల్లిలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ పెరిగాయి. కేపీహెచ్‌బీ కాలనీ హైటెక్ సిటీ మార్గంలో ఉన్న ఒక్క ఫ్లై ఓవర్ మీదుగా నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించడంతో కేపీహెచ్‌బీ కాలనీ, జేఎన్టీయూహెచ్ రోడ్లపై నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది.
ఈ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా జేఎన్టీయూహెచ్ హైటెక్ సిటీ మార్గంలో రాజీవ్ గాంధీ సర్కిల్ చౌరస్తాలో రూ.100 కోట్లతో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించడంతో పాటు కాలనీ 7వ ఫేజ్ సమీపంలో రూ.60 కోట్లతో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తగ్గకపోవడంతో ప్రత్యామ్నాయంగా కైత్లాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రూ.83 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. చేపట్టిన పనులు పూర్తి కావడంతో నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు.
తగ్గనున్న దూర భారం..
కైత్లాపూర్ అయ్యప్ప సొసైటీ ఆర్వోబీ అందుబాటులోకి రావడంతో కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు దూరభారం, ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. కూకట్పల్లి, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, వివేకానందనగర్, జగద్గిరిగుట్ట, బాలానగర్, చింతల్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు హైటెక్ సిటీకి వెళ్లాలంటే జేఎన్టీయూహెచ్ మీదుగా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్‌ను దాటాల్సి ఉండేది. కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తుండటంతో జేఎన్టీయూహెచ్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, బాలానగర్, సనత్‌నగర్, ఫతేనగర్‌లలో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రజలకు హైటెక్ సిటీ వెళ్లేందుకు దూరభారం తగ్గనుంది. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆకట్టుకునే పెయింటింగ్స్, పచ్చని మొక్కలు..
నూతనంగా నిర్మించిన ఆర్వోబీ పిల్లర్లకు ఆకట్టుకునే పెయింటింగ్స్ వేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా పెయింటింగ్స్ ఉన్నాయి. మొక్కలు నాటి కాపాడుకోవాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపేలా పెయింటింగ్స్ ఉన్నాయి. అలాగే ఫ్లై ఓవర్ కింద పచ్చని మొక్కలు నాటి ఆహ్లాదకరమైన పార్కుగా అభివృద్ధి చేశారు. ఈ మొక్కల చుట్టూరా కంచెను ఏర్పాటు చేశారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయగా, పగలు రాత్రి ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
ప్రాజెక్టు హైలెట్స్..
ప్రారంభోత్సవం ఘనంగా చేద్దాం: ఎమ్మెల్యే కృష్ణారావు
కైత్లాపూర్ ఆర్వోబీ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. బ్రిడ్జి కింద అధికారులు, కార్పొరేటర్లతో సోమవారం సమావేశం నిర్వహించి ప్రారంభోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం, స్థానిక ప్రజలతో బహిరంగ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, జూపల్లి సత్యనారాయణ, పగడాల శిరీషా బాబురావు, సబీహా బేగం, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు శ్రవణ్ కుమార్, కాండూరి నరేంద్రాచార్య, ఆయా డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.