సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) :పోలీస్ శాఖలో సైకాలజీ తరగతులు నిర్వహిస్తున్న ఓ మహిళకు ఫేస్బుక్(ఎఫ్బీ)లో పరిచయమైన సైబర్ నేరగాడు పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. పదోన్నతి వస్తుందని చెప్పి బంగారు నగలు అమ్మిపించాడు. అతడి వద్ద ఉన్న డబ్బులు సైతం బాధితురాలి ఖాతాలో డిపాజిట్ చేసి.. మొత్తం డబ్బులు మరొకరి ఖాతాలో వేయించాడు. చివరకు పదోన్నతి కల్పిస్తానని చెప్పిన వ్యక్తి మృతిచెందాడని చెప్పించడంతో పాటు డబ్బులు ఇవ్వాలని వేధింపులకు దిగాడు. చేసేదిలేక బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. అయితే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌నని, బాలీవుడ్ డైరెక్టర్‌నని ఒక్కడే ఇద్దరిగా పరిచయం చేసుకొని లక్షలు కొట్టేశాడని పోలీసులు భావిస్తున్నాడు.
సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సికింద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో బాధితురాలికి ఫేస్బుక్లో సుమిత్ సురాయ్ పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సీఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానంటూ పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే తనకు పదోన్నతి వచ్చిన తరువాత పెండ్లి చేసుకుంటానంటూ తెలిపాడు. ఈ క్రమంలో బాధితురాలికి ఫేస్బుక్లో రవికపూర్ అనే వ్యక్తి బాలీవుడ్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. అతడితో ఆమె చాటింగ్ చేయడంతో తనకు పలువురు పెద్దలతో పరిచయాలున్నాయని, రూ.20 లక్షలు చెల్లిస్తే సుమిత్రాయ్కి పదోన్నతి ఇప్పించగలనంటూ రవికపూర్ నమ్మించాడు. ఈ విషయాన్ని సుమిత్తో చర్చించగా సరేనన్నాడు. ప్రస్తుతం తన వద్ద రూ.13 లక్షలు ఉన్నాయని తెలిపిన సుమిత్ వాటిని బాధితురాలి ఖాతాలో జమ చేశాడు. మిగతా డబ్బులు సమకూర్చి రవికపూర్‌కు పంపించాలని సూచించాడు. దీంతో ఆమె తన బంగారాన్ని అమ్మేయగా వచ్చిన రూ.3 లక్షలు కలిపి మొత్తం రూ.16 లక్షలు రవికపూర్ ఖాతాలో డిపాజిట్ చేసింది.
మరో రూ.4 లక్షలు కావాలని రవికపూర్ చెప్పడంతో వాటిని సమకూర్చే పనిలో బాధితురాలు నిమగ్నమైంది. అంతలోనే రవికపూర్ గుండెపోటుతో మృతిచెందాడని సమాచారం అందించారు. ఈ విషయం బాధితురాలు సుమిత్‌కు తెలుపగా తాను ఇచ్చిన రూ.13 లక్షలు తిరిగి ఇవ్వాలని వేధింపులకు దిగాడు. చేసేదిలేక బాధితురాలు సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితురాలిని బురిడీ కొట్టించేందుకు ఒక్కడే ఇద్దరిగా నటించి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలాఉండగా సుమిత్‌రాయ్ సైబర్‌నేరాల్లో ఆరితేరి ఉండటంతో, ఇతరులను మోసం చేసి డిపాజిట్ చేయించిన సొమ్మును బాధితురాలి ఖాతాలో డిపాజిట్ చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.