సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతున్న వ్యూహాత్మక దారులతో నగరవాసులు ఊరట పొందుతున్నారు. తాజాగా కూకట్పల్లి నియోజకవర్గంలో కైత్లాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రూ. 83కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది. మంగళవారం (21తేదీన) పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఆర్వోబీని ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి రాకతో కూకట్పల్లి, బాలానగర్, ఫతేనగర్, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ మార్గంలో సులభంగా హైటెక్ సిటీకి చేరుకోనున్నారు. మరోవైపు జేఎన్టీయూహెచ్ హైటెక్ సిటీ మార్గంలోని ఫ్లై ఓవర్, అండర్‌పాస్ బ్రిడ్జిలపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది.
రూ. 83.06కోట్లతో నిర్మాణం
కైత్లాపూర్ ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.83.06కోట్లు ఖర్చు చేసింది. రైల్వే పనులకు రూ. 18.06కోట్లు, భూ సేకరణకు రూ.25కోట్లు, నిర్మాణానికి జీహెచ్ఎంసీ రూ. 40కోట్లు వెచ్చించింది. 675.50 మీటర్ల పొడవులో ఆర్వోబీ చేపట్టింది. 46 మీటర్ల మేర రైల్వే స్పాన్, 16.61 మీటర్లలో నాలుగు లేన్ల బైడైరెక్షన్లలో నిర్మాణం జరిగింది. 5.50 మీటర్లలో సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా ప్రస్తుతం ఉన్న జేఎన్టీయూ, హైటెక్ సిటీ బ్రిడ్జిలపై వాహనాల రద్దీ తగ్గుతుంది. మలేషియా టౌన్షిప్ జంక్షన్, హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్స్ జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. సనత్‌నగర్, బాలానగర్, మూసాపేట ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా హైటెక్‌సిటీకి సులువుగా చేరుకోవచ్చు. దీంతో జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. దాదాపు 5 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. సుమారు గంట సమయం ఆదా అవడంతో పాటు సులువుగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది.
ట్రాఫిక్ కష్టాలకు చెక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 19 : కైత్లాపూర్ ఆర్వోబీతో కూకట్‌పల్లిలో ట్రాఫిక్ కష్టాలన్నీ తీరుతాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కైత్లాపూర్ ఆర్వోబీ ప్రారంభోత్సవం పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్‌కుమార్, శంభీపూర్‌రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్పల్లి అంటేనే ట్రాఫిక్ కష్టాలు అని భయపడే రోజులుండేవి.. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో వంద కోట్ల రూపాయలతో కేపీహెచ్‌బీ కాలనీలో ఫ్లై ఓవర్, రూ.60 కోట్లతో కాలనీ 7వ ఫేజ్‌లో రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి (ఆర్యూబీ), బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో సుమారు రూ.400 కోట్లతో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించినట్లు తెలిపారు.
తాజాగా, రూ.86 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుండటంతో కూకట్పల్లి హైటెక్ సిటీ మార్గంలో వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయన్నారు. కూకట్పల్లి, బాలానగర్, ఫతేనగర్, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ బ్రిడ్జి మార్గంలో సులభంగా హైటెక్ సిటీకి చేరుతారని తెలిపారు. మరోవైపు జేఎన్టీయూహెచ్ హైటెక్ సిటీ మార్గంలోని ఫ్లై ఓవర్, అండర్‌పాస్ బ్రిడ్జిలపై ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని ట్రాఫిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
ప్రారంభోత్సవాన్నివిజయవంతం చేయాలి..
కైత్లాపూర్ ఆర్వోబీని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ నేతలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు కోరారు. కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా, ట్రాఫిక్ రహితంగా అభివృద్ధి చేసిన మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.