మహేశ్వరం, జూన్ 15: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మోడల్ స్కూల్ మహేశ్వరానికి మణిహారంగా మారింది. మోడల్ స్కూల్‌ను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు మంత్రి ప్రత్యేక శ్రద్ధతో పనులకు శ్రీకారం చుట్టారు. నేటి బాలలే రేపటి పౌరులని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ముందు చూపుతో మోడల్ స్కూళ్లను అన్ని రంగాల్లో ఆధునీకరిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మహేశ్వరంలోని మోడల్ స్కూల్‌ను తీర్చి దిద్దుతున్నారు. రూ.4కోట్లతో అదనపు గదులు నిర్మిస్తున్నారు. ల్యాబ్‌లు, ప్రహరీ, బాలికల వసతి గృహాల పనులను చేపడుతున్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మోడల్ స్కూల్‌ను ఒక రోల్ మోడగా నిర్మిస్తున్నారు. ఈ పాఠశాలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం ఇంగ్లిష్ బోధనను అందిస్తున్నది. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునేందుకు వీలుగా అన్ని రకాల సదుపాయాలను ఈ మోడల్ స్కూల్లో కల్పిస్తున్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ చదువుపై ప్రత్యేక శ్రద్ధను తీసుకొస్తున్నారు. పదో తరగతి విద్యార్థులను స్పెషల్ క్లాసుల ద్వారా సిద్ధం చేస్తున్నారు. వృత్తి విద్యాకోర్సుల్లో సైతం ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. ఉచిత యూనిఫాంలు, భోజన సదుపాయాలను కలిపిస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. సకల హంగులతో మోడల్ స్కూల్ నిర్మాణ పనులను చేపడుతుండంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సకల సదుపాయాలతో..
రూ4కోట్లతో మోడల్ స్కూల్ నిర్మాణ పనులను చేపడుతున్నాం. పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మోడల్ స్కూళ్లను నిర్మిస్తున్నాం. స్కూల్లో నైపుణ్యత గల ఉపాధ్యాయులు ఉన్నారు. హాస్టల్ వసతులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు.. వైఫైలతో సహా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని హంగులతో మోడల్ స్కూల్‌ను నిర్మిస్తున్నాం. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా కృషి చేయాలి.
– సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం మోడల్ స్కూల్లను తీర్చిదిద్దుతున్నారు. మహేశ్వరం మండలం కేసీ తండాలో మోడల్ స్కూల్లో అదనపు గదుల నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.
– మోతీలాల్ నాయక్, కేసీ తండా సర్పంచ్