మన్సూరాబాద్, జూన్ 14: ఫతుల్లాగూడలో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మిస్తున్న మహాప్రస్థానం పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధి ఫతుల్లాగూడలో రూ.21కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న మహాప్రస్థానం పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు ఎకరాల స్థలంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల కోసం రూ.21కోట్లతో వేర్వురుగా మహాప్రస్థానంను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణానికి దగ్గరగా సకల సౌకర్యాలతో శ్మశానవాటికలను ఏర్పాటు చేసి అంత్యక్రియలను నిర్వహించేందుకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. పురుషులు, స్త్రీలు స్నానాలు చేసేందుకు వేర్వేరుగా గదులను నిర్మిస్తున్నామని తెలిపారు.
అంత్యక్రియల అనంతరం పదిరోజుల పాటు హస్తికలను భద్రపర్చుకునేందుకు లాకర్ సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణులు అపరకర్మలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయించి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభింపజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ పద్మ, డీఈ వెంకటరమణ, ఏఈ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.