ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 14: సెల్ కల్చర్‌లో నైపుణ్యాలను పెంచుకుంటే విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఓయూ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఏ.బాలకిషన్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మైక్రో బయాలజీ, సీపీఎంబీ సంయుక్తంగా ‘యానిమల్ సెల్ కల్చర్ టెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్’అనే అంశంపై ఐదు రోజుల వర్కషాప్ను నిర్వహిస్తున్నారు. సీపీఎంబీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ బాలకిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సెల్ కల్చర్‌కు ఉన్న ప్రాధాన్యతను లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, బయో మెడికల్ ఇంజినీరింగ్, కెమికల్ టెక్నాలజీ వంటి రంగాల్లోని పరిశోధకులు గుర్తించారని అన్నారు.
నగరంలోని జీనోమ్ వ్యాలీలో వందల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని, సెల్ కల్చర్‌లో నైపుణ్యాలను పెంచుకుంటే అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీరయ్య, వర్క్‌షాప్ చైర్మన్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భీమా, దండు బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో డాక్టర్ సాయిరాం, సదస్సు నిర్వాహకులు డాక్టర్ సందీప్త బూర్గుల, డాక్టర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ హమీదా బీ, శాంతి కుమార్ పాల్గొన్నారు.