సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): అక్కడ అడుగు పెడితే చాలు పక్షులు పలకరిస్తాయి. కిలకిల రావాలతో మనసును ఆనంద డోలికల్లో ముంచేస్తాయి. ఒకటి కాదు వందల రకాల పక్షలు ఒక్కదగ్గర చేరితే అదో వింతలోకం. ఇంతటి అద్భుతమైన, వింతైన ప్రపంచాన్ని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) నగర శివారులో నిర్మిస్తున్నది. గ్రేటర్ చుట్టూ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్న సుమారు 80 ఎకరాల్లో పక్షుల అభయారణ్యాన్ని చేపట్టింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ మార్గంలో రాజేంద్రనగర్, హిమాయత్‌సాగర్‌ల మధ్య నగర వాసులకు సరికొత్త అందాలను పరిచయం చేసేలా ఈ అభయారణాన్ని అందుబాటులోకి తేనున్నారు. అంతేకాక ఆక్వేరియం, ఫుడ్ కోర్ట్స్.. ఇలా అనేక రకాల ఏర్పాట్లు చేయనున్నారు.
కొత్వాల్‌గూడ.. అందాలకు నిలయంగా
నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు హెచ్ఎండీఏ ఈ పార్కుకు రూపకల్పన చేస్తున్నది. ఎప్పటి నుంచో ప్రతిపాదనల్లో ఉన్న కొత్వాల్‌గూడ ఎకో పార్కును తాజాగా పలు మార్పులతో ఇప్పటి తరానికి నచ్చేలా.. పూర్తిస్థాయిలో అందం.. అనుభూతులను పంచేలా తీర్చిదిద్దనున్నారు. పార్కుల అభివృద్ధి, నిర్వహణలో పేరుగాంచిన హెచ్ఎండీఏ ఇప్పటికే గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో పలు పార్కులను అభివృద్ధి చేసి నగరవాసులకు అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. ముఖ్యంగా ఐటీ కారిడార్ వైపు పార్కులు తక్కువగా ఉండటం.. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఓఆర్ఆర్ మార్గంలో ఐటీ కంపెనీలు, అందులో పని చేసే ఉద్యోగులు, పరిసర ప్రాంత వాసులకు పార్కులు లేని లోటును తీర్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
జలాశయం పక్కన..ఓఆర్ఆర్కు ఇరువైపులా
జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్ పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుండగా ఈ జలాశయాన్ని ఆనుకొనే హెచ్ఎండీఏకు చెందిన స్థలం ఉంది. ఇదంతా ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉండగా అభయారణ్యాన్ని ఏర్పాటు చేస్తే నగరవాసులకు ఆటవిడుపుగా మారనున్నది. ముఖ్యంగా కేబీఆర్ పార్కు తరహాలో ఐటీ కారిడార్, ఔటర్ వెంట ఇలాంటి పార్కును అభివృద్ధి చేసేందుకు అధికారులు సంసిద్ధులవుతున్నారు. 80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ పార్కుకు అద్భుతమైన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేసి.. అందులో పచ్చదనం పెంచనున్నారు. లుంబినీ, ఎన్టీఆర్, సంజీవయ్య, కేబీఆర్, సరూర్‌నగర్ లాంటి పార్కుల తరహాలో దీన్ని తీర్చదిద్దనున్నారు.
రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు..
కొత్వాల్‌గూడలోని హెచ్ఎండీఏ స్థలంలో ఎకో, నైట్ సఫారీ ప్రాజెక్టులను చేపట్టాలని గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఆచరణలో అవి సాధ్యం కాలేదు. అయితే అందుబాటులో ఉన్న 80 ఎకరాల స్థలంలో తక్కువ వ్యయంతో నగరవాసులకు ఆహ్లాదం పంచే పార్కును అభివృద్ధి చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు. ఇందుకు అనుగుణంగానే అధికారులు కొత్వాల్‌గూడలోని స్థలంలో పార్కును అభివృద్ధి చేసేందుకు అవసరమైన డిజైన్లు రూపొందించారు. అభయారణ్యంతో పాటు రకరకాల అక్వేరియాలను అభివృద్ధి చేయనున్నారు. ఇటీవలే టెండర్ ప్రక్రియ ప్రారంభించిన అధికారులు త్వరలోనే క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టనున్నారు.