ఖైరతాబాద్, జూన్ 10 : నామమాత్రపు రుసుములతో శస్త్రచికిత్సలు, ఆధునిక వైద్యసేవలందిస్తున్న నిమ్స్ దవాఖానలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ), ఎమర్జెన్సీ వార్డుల ఆధునీకరణకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), టాటా ట్రస్ట్‌లు రూ.8 కోట్లు సమకూర్చాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా ఈ నిధులను అందజేయడంతో ఆస్పత్రిలోని 3,4, 5వ అంతస్తుల్లోని ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులను అన్ని సదుపాయాలతో ఆధునీకరించారు. శుక్రవారం నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌తో కలిసి హెచ్ఏఎల్ డైరెక్టర్ అలోక్‌వర్మ, టాటా ట్రస్ట్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధునిక వార్డులను ప్రారంభించారు. అదనంగా 350 నుంచి 400 మంది రోగులకు మేలు జరగనుంది.