సికింద్రాబాద్, జూన్ 10: ప్రభుత్వ కళాశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల నూతన భవన నిర్మాణానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డిలతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ, కళాశాల నూతన భవన నిర్మాణానికి డాక్టర్ మునగ రామ్మోహన్రావు ఎంతో సహృదయంతో రూ.2.80 కోట్లు వెచ్చించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని, దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
నాణ్యమైన విద్యకు ప్రభుత్వం పెద్దపీట..
రాష్ట్ర సర్కార్ విద్యకు పెద్దపీట వేస్తూ సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ వాణీదేవిలు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు ఇప్పటికే ‘మన ఊరు- మన బడి’, ‘మన బస్తీ- మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఓమర్ జలీల్, బోర్డు మాజీ సభ్యులు శ్యామ్ కుమార్, నళినీ కిరణ్, మహిళా టీఆర్ఎస్ నాయకురాలు నివేదిత, నేతలు పిట్ల నగేష్ ముదిరాజ్, ముప్పిడి మధుకర్, హరికృష్ణ, అజయ్, నవీన్, సంతోష్, భాస్కర్ ముదిరాజ్, శ్రీహరి, నిత్యానంద్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ మేఘనతో పాటు అధ్యాపక బృందం, కళాశాల భవన నిర్మాణ దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు భరోసా కల్పించేందుకే..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన నేను.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. నా విద్యాభ్యాసం సమయంలో చాలా మంది చదువు కోసం పడిన ఇబ్బందులు చూశాను. ఎమ్మెస్సీలో నాకు వచ్చిన మెరిట్ స్కాలర్షిప్ను కూడా తోటి పేద విద్యార్థులకు సాయంగా అందించాను. చెన్నైలో ఓ కంపెనీ గ్రూప్ సీఈఓగా, మేనేజ్మెంట్ స్కూల్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించాను. ప్రస్తుతం పలు కార్పొరేట్ కంపెనీలకు సీఈఓగా వ్యవహరిస్తున్నాను.
పేద విద్యార్థులు చదువుతున్న మారేడ్‌పల్లిలోని జూనియర్ ప్రభుత్వ బాలికల కళాశాల భవనాన్ని నిర్మించాలనే తలంపుతో సుమారు రూ.2.80 కోట్లతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాను. దాదాపు 17వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్ సహా ఎనిమిది ఫ్లోర్లతో కూడుకున్న 16 తరగతి గదులను నిర్మిస్తున్నాం. ఈ భవన నిర్మాణం పూర్తయితే 1500 మంది పేద విద్యార్థులు చదువుకునేందుకు వీలు కలుగుతుంది. సకల సౌకర్యాలతో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.
– డాక్టర్ మునగ రామ్మోహన్ రావు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, కళాశాల భవన నిర్మాణ దాత