ఖైరతాబాద్, జూన్ 10 : భక్త జన కోటికి ఆరాధ్యుడు.. వైవిధ్య రూపాల్లో దర్శనమిచ్చే గణనాథుడు.. ఈసారి ప్రకృతికి ప్రతిరూపంగా మట్టి ప్రతిమగా ఆవిష్కృతమవుతున్నాడు. మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు అంకురార్పణగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కర్రపూజ మహోత్సవం నేత్ర పర్వంగా సాగింది. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు, సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. రాజేశ్ చంద్ర, ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయా రెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 68వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని తెలిపారు. ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలోనే తొలిసారిగా 50 అడుగుల ఎత్తయిన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏడాది మాదిరిగానే భక్తులకు మట్టిగణపతి రూపంలో దర్శనమిస్తారన్నారు.
పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా..
ఖైరతాబాద్‌లో 50 అడుగుల ఎత్తులో మట్టితో రూపుదిద్దుకోనున్న గణేశుడికి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా నామకరణం చేస్తున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. మరో వారం పది రోజుల్లో విగ్రహం పూర్తి నమూనాను విడుదల చేస్తామని, వెంటనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆగస్టు 31 లోపు విగ్రహం తయారీ పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు సింగరి రాజ్ కుమార్, మహేశ్ యాదవ్, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి, డీఐ రాజూనాయక్ తదితరులు పాల్గొన్నారు.