సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జీరో అడ్మిషన్లు నమోదవుతున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలపై ఓయూ అధికారులు దృష్టి సారించారు. వరుసగా మూడు విద్యా సంవత్సరాలుగా ప్రైవేటు కాలేజీలలో జీరో అడ్మిషన్లు నమోదవుతున్న కాలేజీల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. జీరో అడ్మిషన్లు నమోదవుతున్న కాలేజీలలో నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, ఆయా కాలేజీలలో చదివే విద్యార్థులు లేకపోవడం, ఫీజులు రాకపోవడంతో టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి కూడా జీతాలు చెల్లించే విషయంలో యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో ఆయా కాలేజీలను కొనసాగించడానికి అనుమతులు ఇవ్వడానికి బదులుగా వాటిని మూసివేయడమే ఉత్తమమన్న అభిప్రాయానికి వర్సిటీ అధికారులు వచ్చారు. దీనిపై ఇప్పటికే గత వారంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీసీల సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు.
అయితే 2022-23 వరుసగా మూడు సంవత్సరాల నుంచి జీరో అడ్మిషన్లు నమోదవుతున్న కాలేజీలను గుర్తించి..వాటికి నోటిసులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో దాదాపు 600 పైగా అఫిలియేషన్ పొందిన డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో దాదాపు 30 శాతానికి పైగా ఉన్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలలో కొన్ని కోర్సులలో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. అలాగే కొన్ని కాలేజీలలో ఉన్న అన్ని రకాల కోర్సులలో కూడా జీరో అడ్మిషన్లు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.