సిటీబ్యూరో/అబిడ్స్/బొల్లారం, జూన్ 3 (నమస్తే తెలంగాణ): విహార యాత్ర.. నగరానికి చెందిన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నగర వాసులు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో నిద్రలోనే నగరానికి చెందిన ఏడుగురు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. ప్రతి ఏటా విహార యాత్ర చేసే ఆ కుటుంబంలో ఈసారి తీవ్ర విషాదం నెలకొంది. బొల్లారం రిసాలబజార్ ప్రాంతంలోని బంజారా విలేజ్ కాలనీకి చెందిన ముకుందరావు కుటుంబం ప్రతి ఏటా వేసవిలో విహార యాత్రకు వెళ్లి వస్తుంటారు. ఈసారి కూడా మనుమరాలి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన అనంతరం, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గోవాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వయస్సు మీదపడటంతో తాను రాలేనని కొడుకు అర్జున్ కుమార్‌కు చెప్పాడు.
దీంతో అర్జున్‌కుమార్(36), ఆయన భార్య సరళాదేవి(34), వారి కుమారుడు వివాన్(3), కూతురుతో పాటు అర్జున్ మేనత్త అనిత(58), కామాటిపురాలో నివాసముండే ఆమె కూతురు, అల్లుడు రవళి(32), శివకుమార్(38), మనుమండ్లు దీక్షిత్(9), అద్విత్ మరికొంతమంది బంధువులతో కలిసి గోవా వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే గతనెల 28న బొల్లారం నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో బంధువులతో కలిసి వెళ్లారు. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులతో నాలుగు రోజుల పాటు గోవా, పరిసర ప్రాంతాల్లో గడిపారు. గురువారం రాత్రి గోవా నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని కలుబురిగి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. అర్జున్‌కుమార్, అనిత రెండు కుటుంబాల్లో ఇద్దరు మినహా మిగతా ఏడుగురు సభ్యులు ఈ బస్సు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లో విషాదం నెలకొంది.
ఆనందంగా గడిపి వస్తున్న కుటుంబాలలో అనుకోని ఘటనతో రిసాలబజార్, కమాటిపురాలో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదం గుర్తించి తెలియగానే అర్జున్ తండ్రి ముకుందరావు హుటాహుటిన ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లారు. అలాగే, మరికొందరు కలబుర్గి కమలాపురం ప్రభుత్వ దవాఖాన నుంచి మృతదేహాలను తీసుకువచ్చేందుకు వెళ్లారు. దాదాపు కాలిపోవడంతో మృతి చెందిన వారిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో పోస్ట్మార్టంతోపాటు డీఎన్ఏ నిర్వహించిన అనంతరం మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగిస్తామంటూ అక్కడి అధికారులు చెబుతున్నారని మృతుడి బంధుమైన శ్రావణ్ తెలిపారు.
బంజారా విలేజ్ కాలనీలో విషాదఛాయలు..
తమ వాళ్లు విహార యాత్ర ముగించుకొని క్షేమంగా తిరిగి వస్తున్నారంటూ వారి కుటుంబ సభ్యులు భావించారు. అంతలోనే పిడుగులాంటి వార్త వచ్చింది. కర్ణాటకలో బస్సు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. దీంతో మృతుల కుటుంబ సభ్యులతో పాటు కాలనీలో విషాదం నెలకొంది. ప్రమాదంలో కాలనీకి చెందిన అర్జున్, సరళా దేవి, వివాన్, అనిత మృతి చెందారన్న వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రైవేట్ కంపెనీలో తెలంగాణ స్థాయిలో మేనేజర్‌గా పనిచేస్తున్న అర్జున్ కాలనీలో అందరితో కలివిడిగా ఉండేవాడు. గురువారం రాత్రి ఫోన్ చేశారని, తిరుగు ప్రయాణమైనట్లు తెలిపారని స్థానికులు తెలిపారు. ఉదయం వరకు హైదరాబాద్‌లో ఉంటామని చెప్పినవాళ్లు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ కుటుంబీకులు బోరున విలపించారు.
కామాటిపురాలో..
విహార యాత్రకు వెళ్లిన కామాటిపురాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. న్యాయస్థానంలో పనిచేసే శివకుమార్, రవళి, దీక్షిత్ మృతి చెందారు. పెద్ద సంఖ్యలో మృతుల బంధువులు, కాలనీ వాసులు వారి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. బస్తీలో అందరితో కలిసి మెలిసి ఉండే శివకుమార్ మృతి చెందడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన విషయాన్ని ఇంకా కొందరు నమ్మలేకపోతున్నారు.
మృతుల కుటుంబాలకు మంత్రి తలసాని పరామర్శ
బస్సు ప్రమాద దుర్ఘటనలో రిసాలబజార్ బంజారా విలేజ్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి తలసాని, ఎమ్మెల్యే సాయన్న, పలువురు కలిసి మృతుల నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికీ రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి రూ.50 వేలు, మెరుగైన చికిత్స అందిస్తామని వెల్లడించారు.