చార్మినార్, జూన్ 3 : రైలులో సమోసాల విక్రయం మాటున గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన శ్రీనివాసచారి రైళ్లలో తిరుగుతూ సమోసాలు విక్రయించి, వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తాడు. వ్యాపారంలో భాగంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైళ్లల్లో సమోసాలు విక్రయిస్తుంటాడు. నగరంలో గంజాయికి అధిక డిమాండ్ ఉన్నదన్న విషయాన్ని అతడు గుర్తించాడు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఏపీలోని నర్సీపట్నంకు చెందిన సిద్దూ స్థానికంగా గంజాయిని సరఫరా చేస్తుంటాడు. శ్రీనివాసచారి అతడిని సంప్రదించి తక్కువ ధరకు గంజాయిని సరఫరా చేయాలని కోరాడు.
సమోసాల విక్రయాల మాటున నర్సీపట్నం నుంచి నగరానికి గంజాయిని తరలిస్తున్నాడు. అవసరం ఉన్న వారికి గంజాయిని విక్రయిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో గంజాయి విక్రయిస్తూ సంతోష్‌నగర్ పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు నుంచి గతనెలలో విడుదలైన శ్రీనివాసచారి తిరిగి గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడు. అతడి దందాపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, నర్సింలు, శ్రీనయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.