యువకుడితో పాటు సహకరించిన మహిళపై కేసు
బంజారాహిల్స్, జూన్ 1: మూగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడితో పాటు అతడికి సహకరించిన మహిళను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నం. 12లోని ఓ బస్తీలో నివాసముంటున్న మూగ బాలిక(16) గతేడాది అక్టోబర్ 2న అదృశ్యమైంది. తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న బాలిక ఆచూకీ లభించడంతో పోలీసులు ఆమెను పునరావాస కేంద్రానికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే ఉన్న బాలికను ప్రశ్నించగా, అదృశ్యమైన తర్వాత తాను గాజుల రామారం సమీపంలో ఉంటున్న కోళ్ల రజినీ అనే మహిళ ఇంట్లో పనిమనిషిగా చేరానని తెలిపింది. అక్కడ ఇంటి పక్కనే ఉండే రజినీ స్నేహితుడు సజ్జపురపు యాదిరెడ్డి (19) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, గంజాయి సేవించడంతో పాటు సిగరెట్ పీకలతో చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ విషయాన్ని గురించి రజినీకి చెప్పినా పట్టించుకోకపోగా ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులకు దిగేదని తెలిపింది. పునరావాస కేంద్రం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితుడు యాదిరెడ్డితో పాటు రజినీపై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.