బోడుప్పల్, జూన్ 1 : ఈ నెల 3 నుంచి 18 వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 4వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమం మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన కమిషనర్ పద్మజారాణి, కౌన్సిల్ సభ్యుల సమక్షంలో బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. నగర పరిధిలోని 28 డివిజన్లలో 15 రోజల పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. గత ఏడాది పట్టణ ప్రగతిలో సాధించిన పనుల పురోగతి వివరాలను కౌన్సిల్ సభ్యులకు అందజేశారు. ప్రతి డివిజన్ పరిధిలో కార్పొరేటర్, ప్రజలను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ కౌన్సిల్ సభ్యులకు సూచించారు. పట్టణ ప్రగతిలో స్వచ్ఛతకు పెద్దపీట వేయనున్నట్లు కమిషనర్ పద్మజరాణి తెలిపారు. బోడుప్పల్ నగరపరిధిలో ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీలో…
ఘట్కేసర్,జూన్1 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ కోరారు. బుధవారం మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ ప్రగతి పై కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతిలో ప్రతిఒక్క కౌన్సిలర్ విధిగా పాల్గొని తమ తమ వార్డుల పరిధిలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. పారిశుధ్యం, హరితహారం, మురుగు కాలువల శుభ్రత, నీటి సరఫరా, పచ్చదనం తదితర అంశాల పై కౌన్సిలర్లు చర్చించారు. కమిషనర్ వసంత, మేనేజర్ అంజిరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
కీసర మండల కేంద్రంలో…
కీసర, జూన్ 1 : ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతిపై బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా గామ సర్పంచ్ అధ్యక్షతన ప్రజలతో కలిసి గ్రామాల్లో పాదయాత్ర , గ్రామసభలో సీఎం సందేశం, 5వ విడుత పల్లె ప్రగతి నివేదిక తయారు చేయడం, తదితర సమస్యలపై దిశానిర్ధేశం చేశారు. సమావేశంలో జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయారు, సర్పంచులు మహేందర్‌రెడ్డి, పెంటయ్య, గోపాల్‌రెడ్డి, ధర్మేందర్, మాధురి వెంకటేశ్, కవితాజైహింద్రెడ్డి, సత్తమ్మ, మండల కో-ఆప్షన్ సభ్యులు ఎం.డి. బషారత్అలీ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ మున్సిపాలిటీలో…
మేడ్చల్ రూరల్, జూన్ 1 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పనిచేసి ఫలితాలు సాధించామని మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహా రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి పట్టణ ప్రగతి ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం చైర్పర్సన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రతే ధ్యేయంగా అధికారులు, కౌన్సిలర్లు పని చేసి, స్వచ్ఛ మేడ్చల్‌కు కృషి చేయాలన్నారు. వైస్ చైర్మన్ రమేశ్, కమిషన్, అహ్మద్ షఫీయుల్లా, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.