మహేశ్వరం, జూన్ 1: తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ కాంటెకార్ మధుమోహన్ మాటిమాటికి రాష్ట్ర విద్యాశాఖ మ్రంతి సబితా ఇంద్రారెడ్డిని విమర్శిస్తే సహించేదిలేదని తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ బాధావత్ రవినాయక్ అన్నారు. బుధవారం తుక్కుగూడ కేంద్రంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి పర్యటనకు కమిషనర్ ప్రతి ఒక్కరికీ సమాచారం అందించారని ఆ సమాచారం మేరకు మంత్రి పర్యటనకు వెళ్లామని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడ పర్యటనకు వచ్చినపుడల్లా వారు రాకుండా అనవసరంగా మంత్రిపైన, ప్రభుత్వం పైన చౌకబారు ఆరోపణలను చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాలకు అతీతంగా తుక్కుగూడ అబివృద్ధికి కృషిచేయాలి.. కానీ ప్రెస్మీట్లు పెట్టి మంత్రిని విమర్శిస్తే ఇక చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి తుక్కుగూడను అభివృద్ధి చేస్తున్నారో బహిరంగ చర్చకు రావాలని ఆయన బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. సూరం చెరువు అబివృద్ధికి మంత్రి దాదాపు రూ.3కోట్లతో సుందరీకరణ పనులను చేపడితే ఓర్వలేని బీజేపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. తుక్కుగూడ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.52కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రెడ్డిగళ్ల సుమన్, నాయకులు బూడిద శ్రీకాంత్‌గౌడ్, సిప్పిడి రాజు ముదిరాజ్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య, పెంటమాల సురేశ్, బ్యాగరి యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పునూతల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.